Tirupati: రికార్డు స్థాయిలో వెంకన్న హుండీ రాబడి.. 128 కోట్ల 64 లక్షలు...

Tirupati: మార్చిలో శ్రీవారిని దర్శించుకున్న 19లక్షల 72వేల 656 మంది భక్తులు

Update: 2022-04-09 05:16 GMT

Tirupati: రికార్డు స్థాయిలో వెంకన్న హుండీ రాబడి.. 128కోట్ల 64 లక్షలు...

Tirupati: తిరుమలకు వెంకన్న భక్తులు పోటెత్తారు. కరోనా పరిస్థితులు కనుమరుగైన తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల సం‌ఖ్యనానాటికీ పెరిగిపోతోంది. కోవిడ్ ఆంక్షలను సడలించిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టిక్కెట్ల కోటాను దశలవారీగా పెంచింది. ఆంక్షలున్న సమయంలో ప్రత్యే్క దర్శన టిక్కెట్లనే పంపిణీ చేసేవారు. రెండేళ్లపాటు సర్వదర్శన టిక్కెట్లపై ఉగాదినుంచి ఆంక్షలను సడలించారు. రోజుకు ఐదువేలమంది భక్తులనుంచి.. క్రమంగా అన్ని విధానాల్లో 70వేలమంది భక్తులు పాల్గొనే విధంగా సదుపాయం కల్పించారు. పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా దేవస్థానానికి హుండీ రాబడి ఆశాజనకంగా పెరిగింది. వారాంతపు సెలవులతో రద్ధీ అనూహ్యంగా పెరిగింది. ఇవాళ 12 తేదీ టోకెన్లను పంపిణీ ఆపేశారు. రద్ధీ పెరగడంతో 13 తేదీ టోకెన్లను 12 తేదీ మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు.

తిరుమల శ్రీవారిని గడిచిన మార్చి నెలలో పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. క్రమేణ కరోనా ఆంక్షలు సడలించడంతో మార్చినెలలో 20 లక్షల మంది స్వామివారి దర్శనభాగ్యం పొందారు. రికార్డు స్థాయిలో హుండీ కానుకలు 129 కోట్ల రూపాయలు సమర్పించారు. భక్తులు దీంతో రెండు సంవత్సరాల తర్వాత శ్రీవారి ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడటంతోపాటు వెంకన్న ఖజానా కానుకలతో గలగలలాడుతోంది.

కరోనా పరిస్థితుల నుండి తిరుమల నెమ్మదిగా కోలుకుంటున్న క్రమంలో పూర్వపు పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గడంతో మార్చి మొదటివారం నుంచి శ్రీవారిని దర్శిం చుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది. ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, ఆఫ్‌లైన్ టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, అదనంగా వర్చువల్ సేవలకు భక్తులు ఉగాదినుంచి పెరిగారు. దీంతో తిరుమల క్షేత్రం రెండేళ్ల తర్వాత భక్తులతో సందడిగా మారింది. గత నెలలో 19లక్షల 72వేల 656 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ కానుకల ద్వారా 128కోట్ల 64 లక్షల రూపాయలు హుండీ ఆదాయం లభించిందని ఆలయాధికారులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రస్తుతం సగటున రోజుకు 65 వేల లోపు ఉన్నప్పటికీ మహా ప్రసాదంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని ఒకోటి నాలుగు లక్షల ల‌డ్డూల‌ను భక్తులు కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే 9లక్షల 54 వేల మంది భ‌క్తులు శ్రీ‌వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 24లక్షల10వేల మంది భ‌క్తులు ఉచిత అన్నప్రసాదం స్వీకరించారు. ప్రత్యేకించి మార్చి 19వ తేదీన ఒక్కరోజే అత్యధికంగా 5కోట్ల13 లక్షలమేర రాబడి లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు. అదే రోజు 80వేల 429 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈనెల రెండో తేదీ ఉగాదినుంచి పెరిగిన భక్తులతో శ్రీవారి ఆలయం కళకళలాడుతోంది. హుండీ రాబడి ఆశాజనకంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News