తెలంగాణ యోగి కనిపించడం లేదెందుకు?

Update: 2019-08-23 13:47 GMT

తెలంగాణ బీజేపీ యోగి ఎక్కడ....? అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా దూసుకెళ్లిన ఆ స్వామిజీ ఇప్పుడెక్కడ...? ఢిల్లీ అధిష్టానమే పక్కనపెట్టేసిందా లేదంటే కమలం పార్టీలో రాజకీయాలు స్వామిజికి రుచించలేదా....? కాంట్రావర్సీ కామెంట్లతో కాకరేపే స్వామిజీ, ఎందుకు బిజేపికి దూరంగా ఉంటున్నారు..?

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌. తెలంగాణ యోగి స్వామి పరిపూర్ణానంద

అక్కడ యోగిలా ఇక్కడ విజృంభణకు వ్యూహాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేనూ గెలిపించలేక తిరగబడిన స్ట్రాటజీ

ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపి భావోద్వేగాలతో రెచ్చగొట్టి..ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కానరాని పరిపూర్ణానంద

తెలంగాణ యోగి కనిపించడం లేదెందుకు?

అసెంబ్లీ ఎన్నికల ముందు, తెలంగాణ బిజేపిలో స్వామి పరిపూర్ణనంద ప్రత్యేకమైన నేత. ఆయన్ను నేరుగా జాతీయపార్టీ నేతలే, పార్టీలో చేరాలని ఆహ్వానించి చాలా హడావిడి చేశారు. బిజేపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో రహస్యంగా భేటి అయ్యి పార్టీలో చేరితే, రాజకీయంగా బాగుంటుందని కూడా చెప్పారని అప్పట్లో చర్చ జరిగింది. ఢిల్లిలో అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు స్వామిజీ. తెలంగాణలో మరో యోగిలా చెలరేగిపోయి ప్రచారం చెయ్యాలని, పార్టీ అధికారంలోకి రాగలిగితే కీలకమైన పదవి ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. దీంతో స్వామిజీలో ఉత్సాహం ఉరకలెత్తింది.

చేరిందే తడువుగా తెలంగాణలో బాగానే హడావిడి చేశారు పరిపూర్ణానంద. అనేక కాంట్రవర్సీ కామెంట్స్ చేసి, పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. మతం, జాతీయవాదమే అంశాలుగా కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అయితే స్వామి పరిపూర్ణనంద, కొన్ని నియోజికవర్గాలను మాత్రమే ఎంచుకొని ప్రచారం చేశారు. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పోటాపోటీగా, సభలు సమావేశాలు నిర్వహించారు. చాలా అసెంబ్లీ నియోజికవర్గాల్లో రోడ్ షోలతో, పార్టీ అనధికార స్టార్ క్యాంపెయినర్‌గా చక్రం తిప్పారు. సొంత హెలికాఫ్టర్‌పై తిరిగి ప్రచారాన్ని హోరెత్తించారు. ఆయన ఎక్కడకు పోయినా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తన ప్రసంగాలతో కొద్ది రోజుల్లోనే తెలంగాణ యోగిగా పార్టీ నేతలు కీర్తించేలా చేసుకున్నారు. ఆయన పార్టీకి భవిష్యత్తులో అధికారం కట్టబెడతారని అందరూ అంచనా వేశారు కూడా. అయితే డామిట్‌ కథ అడ్డం తిరిగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఉన్న సీట్లను కూడా చేజార్చుకొని ఒక్కసీటుకే పరిమితమైంది. స్వామిజీ తిరిగిన ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. రాజాసింగ్ సొంత ఇమేజ్‌తో గెలిచాడు. తన ప్రయోగం విఫలం కావడంతో ఒక్కసారిగా కలత చెందారట స్వామి పరిపూర్ణానంద. ఏదేదో ఊహించుకున్న పార్టీ అధిష్టానం కూడా, స్వామిజీ ప్రభావం శూన్యమేనని భావించి, ప్రాధాన్యత తగ్గించిందట. దీంతో స్వామిజీ కూడా పార్టీకి దూరం జరిగారు. ఇప్పుడెక్కడా కనిపించకుండా పోయారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభవంతో, రాజకీయాలకు స్వామిజీ దూరం జరిగిన తర్వాత, పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి. అయితే అసెంబ్లీ అనుభవంతో, లోక్‌సభ ఎలక్షన్స్‌ క్యాంపెయిన్‌‌ను అసలు ముట్టుకోలేదు పరిపూర్ణానంద. అసెంబ్లీ పోరులో ఘోరంగా ఓడింది, ఇక పార్లమెంట్‌లో ఒక్క సీటూ రాదని స్వామిజీ వర్గం అంచనా వేసిందట. అయితే, ఈసారి కూడా అంచనా తప్పింది. పార్లమెంట్‌ పోరులో, అందరి అంచనాలను తిప్పికొట్టింది బీజేపీ. నాలుగు ఎంపీ స్థానాలతో వారెవ్వా అనిపించింది. దీంతో మరోసారి అవాక్కవడం స్వామిజీ వంతయ్యింది. ఒకవేళ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వామిజీ ప్రచారం చేసి వుంటే, తన వల్లే నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పుకునే అవకాశం దక్కేది. పార్టీలో భవిష్యత్‌ లీడర్‌గా ఒక వెలుగు వెలిగేవారు. కానీ ప్రచారం చేయలేదు కాబట్టి, చెప్పుకునే ఛాన్సేలేదు. పాపం స్వామిజీ అంటున్నారట బీజేపీ కార్యకర్తలు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వామిజీని అవమానించడం వల్లే బిజేపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, అదే పార్టీలో కొంతమంది సీనియర్లు చెబుతున్నారు. కొన్ని నియోజికవర్గాల్లో ప్రచారం షెడ్యూల్ ఇచ్చి, క్యాన్సిల్ చేయడం ఆయన్ను భాదించిందట. దీనికి తోడు పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఆయన్ను పార్టీ నేతలు ప్రచారానికి ఆహ్వనించకపోవడమే, తెలంగాణ యోగి ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. పార్టీకి ఆదరణ లేని రోజు పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ పుంజుకుంటున్నప్పుడు పార్టీనేతలు పట్టించుకోకపోవడం స్వామిజీకి రుచించడం లేదనే చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించడం సొంతపార్టీ నేతలకు నచ్చడంలేదనే వాదన కూడా వినిపిస్తోంది. చూడాలి, స్వామి పరిపూర్ణానంద, రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో.

Full View 

Tags:    

Similar News