గ్రానైట్ క్వారీలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. గ్రానైట్ క్వారీలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాల్ ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. మంత్రి, ఎంపీ మధ్య వివాదం రాజేస్తోంది. క్వారీల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేస్తుండగా ఆరోపణలు నిరూపించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్ జిల్లా రాజకీయాలు గ్రానైట్ చుట్టు తిరుగుతున్నాయి. గ్రానైట్ క్వారీల అక్రమాలు బయట పెడుతానంటూ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ మధ్య సై అంటే సై అనుకుంటున్నారు. గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు ప్రభుత్వానికి కట్టాల్సిన సీనరేజీన్ 749 కోట్లు కట్టకుండా మ్యానేజ్ చేసుకున్నాయని బీజీపీ ఆరోపిస్తోంది. వీటిపై సీబీఐ విచారణ జరిగేలా చేస్తామని ఎంపీ బండి సంజయ్ కామెంట్ చేశారు.
దీనిపై మంత్రి గంగుల కమలాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సంజయ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రానైట్ అంశంలో మంత్రులపై చేస్తున్న ఆరోపణలు నిరూపించకపోతే సంజయ్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఎంపీ, మంత్రి ఇద్దరు గ్రానైట్ అవినీతిపై సవాల్ ప్రతి సవాల్ విసురుకోవడం రాజకీయ సెగలు రేపుతోంది. రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసిన గ్రానైట్ అంశం రాజకీయాలను ఎటువైపు తీసుకెళుతుందో చూడాలి.