VC Sajjanar: బాస్.. అధిగమిస్తారా..ప్రభుత్వానికి వత్తాసు పలుకుతారా..?
VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి.
VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. సుదీర్ఘ కాలంగా ఇంఛార్జ్ ఎండీగా కొనసాగిన సునీల్‌శర్మ స్థానంలో సంచలనాల ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్‌ను పూర్తిస్థాయి ఎండీగా ప్రభుత్వం నియమించింది. లా అండ్ ఆర్డర్‌లో చురుగ్గా కఠిన నిర్ణయాలు తీసుకునే ఈ పోలీస్ బాస్.. ఇప్పుడు ఆర్టీసీపై కూడా అలాగే వ్యవహరిస్తే గాడిలో పడ్డట్టేనని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఓ వైపు కరోనా, మరోవైపు ఉద్యోగుల సమస్యలు, సంస్థ ఆర్థిక కష్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఇబ్బందులు ఆర్టీసీని వెంటాడుతున్నాయి. దాదాపు మూడేళ్లు ఇంఛార్జ్ ఎండీగా ఉన్న సునీల్ శర్మ సంస్థను గాడిలో పెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఉద్యోగులు సైతం ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాజాగా గతంలో మాదిరిగానే ఐపీఎస్ అధికారి సజ్జనార్‌కు ఎండీగా ఛాన్స్ ఇచ్చింది.
అయితే సజ్జనార్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే ఆర్టీసీ 4 వేల కోట్ల నష్టంలో ఉంది. ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి ఇవ్వడం లేదు. దాంతో పాటు ఇప్పటికే రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది నుంచి ఇప్పటివరకు డీజిల్ పై ఏకంగా ఒక్కో లీటర్ కి 25 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నుంచి ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. ఇదిలా ఉండగా నష్టాలు, అప్పులను చూపి ఆర్టీసీ ఆస్తులు, భూములను అమ్మాలని ప్రభుత్వం చూస్తోంది. మరి ఈ సమస్యలను సజ్జనార్ అధిగమిస్తారా..? లేక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతారా..? అన్నది అందరి మదిలో మెదులుతున్న అంశాలు.
ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీగా సజ్జనార్ నియామకంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న సజ్జనార్ ఇప్పుడు ఉద్యోగుల సమస్యలతో పాటు సంస్థను గాడిలో పెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వానికి, ఇటు సంస్థకు, ఉద్యోగులకు మధ్య వారధిలా సజ్జనార్ నిలవాలని కోరుకుంటున్నారు. ప్రజారవాణా సంస్థకు కొత్త బాస్‌గా సజ్జనార్ నియామకంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ఉత్సాహం కనబడుతోంది. అయితే ప్రభుత్వ సహకారం కూడా తోడైతేనే విజయం సాధించగలమనే భావన ఆర్టీసీ ఎంప్లాయిస్‌లో ఉంది.