తొలకరి వానలు కురియగానే రైతులు అంతా వ్యవసాయపనుల్లో మునిగిపోతారు. భూమినిసాగు చేయడం, విత్తనాలు చల్లడం లాంటి పనులను మొదలు పెడతారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు తన పొలంలో దున్నుతుండగా వర్థమాన మహావీరుడి పురాతన విగ్రహం బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు అంజయ్య వర్షాలు పడడంతో పంటలు వేయడానికి తన పొలంలో ట్రాక్టర్ దున్నడం ప్రారంభించాడు.
సరిగ్గా అదే సమయానికి పొలంలో జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడి విగ్రహం లభించింది. దాన్ని గమనించిన అంజయ్య ఈ విషయాన్ని గ్రామసర్పంచ్ కు చేరవేసారు. దీంతో సర్పంచ్ తోట కవిత, గ్రామస్థులు అక్కడికి చేరుకుని వర్థమానుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు సర్పంచ్ వెల్లడించారు. రెండేండ్ల క్రితం ఇదే భూమిలో జైన తీర్థకరుడు పార్శనాథుని విగ్రహం లభించిందని పొలం యజమాని తెలిపారు.