Jeevan Reddy: ఆర్మూర్‌లో జీవన్ మాల్ అండ్ మల్టీప్లెక్స్‌కు నోటీసులు
Jeevan Reddy: జీవన్‌రెడ్డి మాల్‌కు ఆర్టీసీ, విద్యుత్ అధికారుల నోటీసులు
Jeevan Reddy: బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యవహారంపై అధికారులు నజర్ పెట్టారు. ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లీజ్ కు తీసుకున్న వ్యవహారం తీవ్ర చర్చనియాంశంగా మారింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టిఫ్లెక్స్ నిర్మాణం చేసి పలు ప్రైవేట్ దుకాణాలకు లీజ్ కు ఇచ్చారు. అయితే ప్రభుత్వం మారడంతో అధికార యంత్రాంగం తమ పనిని షురూ చేసింది. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలోని జీవన్‌రెడ్డి మాల్‌కు సంబంధించి రూ.7,23,71,807 రెంటల్ బకాయిల విషయమై ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. లేనిపక్షంలో సీజ్ చేస్తామని అల్టిమేటం విడుదల చేశారు.
ఇక రూ.2,57,20,002 విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. జీవన్ రెడ్డి మాల్ పై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నేత పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిలు ద్రుష్టి సారించి, ఎన్నికల్లో ప్రధాన అంశంగా ప్రచారం చేశారు. ఆర్మూర్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆట మొదలు పెట్టడం చూస్తుంటే జీవన్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన తీరేమిటో అర్థం చేసుకోవచ్చు. గతంలో అధికారులను సక్రమంగా విధులు నిర్వహించకుండా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు చక్కబెట్టాలని బెదిరింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.