గులాబీదళంలో అతివలు అలకపాన్పు ఎక్కారట. అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. ఛాన్స్ వచ్చినప్పుడల్లా కేసీఆర్‌కు, లేదంటే కేటీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకుంటున్నా, హైకమాండ్ అసలు కనికరించడం లేదట. ఇంతకీ తెలంగాణ భవన్‌లో అతివల అలకకు కారణమేంటి?
తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా పోరాటాలు చేసిన మహిళా నేతలు, ఇప్పుడు ఆవేదనతో రగిలిపోతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతున్నా, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో తమకు అవకాశాలు ఇవ్వడం లేదని పార్టీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు. తెలంగాణ భవన్ చట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, కనీసం పార్టీ ముఖ్యనేతలు తమను పట్టించుకున్న పాపాన పోలేదని కొందరు మహిళా నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నా, మరికొందరు లోలోపలనే మథన పడుతున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక, స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసినా, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చినా, ఒకరిద్దరు మహిళా నేతలకు మినహా, అసలు ఉద్యమకారులను పక్కనపెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు వేస్తున్నప్పటికీ, మహిళా నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. నామినెటేడ్ పోస్టుల్లో తమకు అవకాశాలు ఇవ్వాలని పదేపదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు విన్నవించుకోవాలనుకున్నా, తగినంత సమయం ఇవ్వడం లేదనే చర్చ, గులాబీ పార్టీలో జరుగుతోంది.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు, క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. అటు ప్రతిపక్షాల నుంచి ఇదే అంశంపై పదేపదే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా, గులాబీ బాస్ పట్టించుకోలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు మహిళా ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో, తమకు ప్రాతనిధ్యం కల్పించాలని సీఎంను అడిగితే, త్వరలో ఇద్దర్ని క్యాబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అయినా ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇదే అంశంపై వివిధ వేదికల్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తలెత్తుతోందని టీఆర్ఎస్ మహిళానేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
మొత్తానికి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, ఈసారైనా అటు పార్టీ పదవుల్లోనూ ఇటు ప్రభుత్వంలోనూ మహిళలకు పెద్దపీట వెయ్యాలనే వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. అతి త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో, ఒకరిద్దరికి తప్పకుండా స్థానం లభిస్తుందని తెలుస్తోంది.