మంది ఎక్కువతై మజ్జిగ పల్చనా అన్నట్టుంది టీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు పార్టీలో కొత్త నాయకులు వస్తున్న కొద్దీ గ్రూపులు కట్టడాలు స్థానికంగా ఆదిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారిని సమూదాయించే ప్రయత్నం చేస్తున్నా పాత పగలు దృష్టిలో పెట్టుకుని, కొత్త వారిని పాతవారు పాతవారు కొత్తవారికి సతాయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా టీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్‌లో బయట పడుతోంది. దీంతో నాయకుల మధ్య సయోధ్య కుదుర్చడానికి అధినేత ఆదేశాలకు అనుగుణంగా, నియోజకవర్గ ఇంచార్జీలు రంగ ప్రవేశం చేసారు.
మొన్నటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు పార్టీ ముఖ్యనేతల అపాయింట్ మెంట్‌లు లేక, ఇటు పార్టీలో ప్రాధాన్యత లేక అసంతృప్తితో లోలోన రగిలిపోతున్నారు. మొన్నటి పరిషత్ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చిన అధిష్టానం, పార్టీ మెంబర్ షిప్ చేయించే విషయంలో తమకు అవకాశం ఇవ్వటం లేదని రగిలిపోతున్నారు మాజీలు.
టీఆర్ఎస్ లో తాజా-మాజీల మధ్య పొంతన కుదరటం లేదు. తాజాగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల నియోకవర్గాల్లో, రెండు వర్గాల మధ్య వివాదాలు రాజుకున్నాయి. పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇవ్వటంతో, మాజీలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. టీఆర్ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటుండటంతో, మా పొజిషన్ ఏంటి అని మాజీలు అసంతృప్తితో ఉడికిపోతున్నారు.
సభ్యత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధినాయకత్వం. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఈ సమావేశాలకు కూడా మాజీలను ఆహ్వానించటం లేదు. నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశానికి, మాజీ ఎమ్మెల్యే వీరేశంను ఆహ్వానించకుండానే, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమావేశాన్ని నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే లింగయ్య వ్యవహారాన్ని పార్టీ ముఖ్యనేతల దృష్టికి, వీరేశం తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. ఆటు రామగుండంలో కూడా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు అసలు మెంబెర్ షిప్ బుక్స్ కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఇవాళ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన గౌరవం లేదని, తనపై, తన అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపిన సోమారపు సత్యనారాయణ కొందరి వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు.
ఇక మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ-తాజా వర్గాల మధ్య గొడవ పెరుగుతోంది. మెంబర్‌షిప్ పుస్తకాలు తమకు ఇవ్వటం లేదని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు టికెట్లు కూడా సదరు ఎమ్ముల్యేలకే అప్పగించింది పార్టీ అధిష్టానం. ఎమ్మెల్యేలు, వారి వెంట టీఆర్ఎస్‌లో చేరిన అనుచరులకే టికెట్లు ఇచ్చుకున్నారని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులకు అసలు పొసగడం లేదు. వారి సమక్షంలోనే అనుచరులు బహాబాహికి దిగడం చర్చనీయాంశమైంది. దీంతో వారి మధ్య సయోధ్య కుదిర్చారు నియోజకవర్గ ఇంచార్జీ.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే పరిస్థితి నెలకొంది. అధిష్టానం ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే ఇంపార్టెన్స్ ఇవ్వడంతో తాము నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సదరు మాజీలు. తమను నమ్ముకున్న అనుచరులకు ఏ సాయం చేయలేకపోతున్నామని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. తమ బాధను పార్టీ పెద్దలకు చెప్పుకునే పనిలో పడ్డారు నేతలు. అయితే పార్టీలోని మిగతా సీనియర్ నాయకులు మాత్రం కొద్దిరోజుల వరకూ ఇలాంటి విభేదాలు కామన్ అని కేవలం క్యాడర్ మధ్యే కానీ, నాయకుల మధ్య విభేదాల్లేవని చెప్తున్నారు. మొత్తానికి టిఆర్ఎస్ అధిష్టానం పాత కొత్త తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ముందుకెళ్లి మెంబర్‌షిప్ కార్యక్రమాన్ని సక్సెస్ చెయ్యాలని పిలుపిస్తే, నేతలు మాత్రం అధిపత్యపోరుతో విభేదాలు సృషించడం గులాబీ పెద్దలకు తలనొప్పిగా మారింది.