ఆయన మృదుస్వభావే. మొన్నటి వరకూ అందరూ ఆ మంత్రిని తెగ అభిమానించినవారే. పార్టీ కార్యక్రమం ఏదైనా, ప్రతి ఒక్కరూ ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని తపించినవారే. కానీ ఒక్క ప్రసంగం, సీన్ మొత్తం రివర్స్ అయ్యేలా చేసింది. ఇప్పుడాయనను, పలకరించడానికే సొంత పార్టీ నేతలు భయపడుతున్నారట. ఆ మంత్రితో మాట కలిపేందుకే హడలిపోతున్నారట. అసెంబ్లీ లాబీల్లో పక్కనే పోతున్నా, ఎందుకైనా మంచిదని చూపు పక్కకు తిప్పుకుని వెళ్లిపోతున్నారట. ఇంతకీ ఎవరాయన ఆ మినిస్టర్ విషయంలో, అంతలోనే ఇంత మార్పు ఎందుకు?
తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ ధిక్కార ప్రసంగం ప్రకంపనలు, సద్దుమణిగినట్టే అనిపించినా, పార్టీలో మాత్రం అలజడి తగ్గినట్టు కనిపించడం లేదు. ఈటెల బాటలో రసమయి, నాయిని, రాజయ్యతో పాటు అనేకమంది స్వరం పెంచడంపై, సహజంగానే గులాబీ అధిష్టానం రగిలిపోతోంది. పార్టీలో కొందరు ఈటెల పట్ల బాహాటంగా సానుభూతి చూపిస్తున్నా, కొంతమంది మాత్రం అసలు ఈటెల పేరు ఉచ్చరించడానికే భయపడుతున్నారన్న చర్చ జరుగుతోంది.
ఈటెలతో మాట్లాడితే, తమను కూడా అదే బ్యాచ్ గాటన కడతారని జంకుతున్నారు చాలామంది గులాబీ నేతలు. అందుకు అసెంబ్లీ సమావేశాలే వేదికయ్యాయి. అసెంబ్లీ లోపలా, బయటా ఈటెల రాజేందర్‌తో మాట్లాడ్డానికి కూడా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేశారు. ఒకవేళ మాట్లాడితే, అధిష్టానం దృష్టిలో నెగెటివ్ రిమార్క్ తప్పదని, అసలు మాట్లాడనే లేదట. ఈటెల అలా వస్తుంటే, వీళ్లు ఇలా చూపు తిప్పుకుని వెళ్లారట. కొందరు మాట్లాడే ప్రయత్నం చేసినా, అప్పటిలా కాకుండా, ముభావంగా, ఏదో విష్ చేశామంటే, చేశామన్నట్టుగా పలకరించారట. ఈ పరిణామాలు ఈటెల రాజేందర్‌కు ఒకింత ఇబ్బందికరంగా అనిపించాయట.
అటు రాజకీయంగా ఈటెలకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన, అదే సామాజికవర్గానికే చెందిన గంగుల కమలాకర్‌ను, ఈటెలకు పోటీగా మంత్రివర్గంలో స్థానం కల్పించారన్న చర్చ జరుగుతోంది. బీఏసీ మీటింగ్‌కు ప్రతిసారి ఈటెలే వెళ్లేవారు. కానీ ఈటెలను కాకుండా ఈసారి గంగులనే పంపించారు. ఈటెల చాంబర్‌ను హరీష్ రావుకు ఇచ్చేసి, మరో ఫ్లోర్‌లోకి మార్పించారు.
మొత్తానికి ఈటెల వ్యవహారంపై టీఆర్ఎస్‌లో గుంభనంగా చర్చ జరుగుతోంది. తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న వార్తల నేపథ్యంలోనే, మొన్న ధిక్కార స్వరం వినిపించారు ఈటెల. ఇప్పటికిప్పుడు పక్కనపెడితే, రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్న ఆలోచనతోనే, కేసీఆర్ కూడా నెమ్మదించినట్టు అర్థమవుతోంది. అయితే, ఈటెల మాటలే స్ఫూర్తిగా, కొందరు నాయకులు కూడా స్వరం పెంచడం, పార్టీలో అప్పటి వరకూ లేని ధిక్కార సంస్కృతికి ఆజ్యంపోసినట్టయ్యిందన్న చర్చ, గులాబీ అధిష్టానాన్ని కుదురుగా ఉండనివ్వడంలేదు. అందుకే ఈటెలపై హైకమాండ్ లోలోపల రగిలిపోతోందని సమాచారం. చూడాలి, ఈటెల వ్యవహారం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో.