ఇంతకాలం ఆ సార్ సహకారం మొండుగా అందింది కానీ ఇక నుంచి ఆయన సేవలు అందే పరిస్థితి లేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి పెద్దాయన ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు రాకపోకలు సాఫీగా సాగాయి. కానీ సార్ ప్లేస్‌లోకి మేడం వస్తున్నారు. ఆ మేడం తమకి అనుకూలంగా ఉంటారా ప్రతికూలంగా వ్యవహరిస్తారా అనే అనుమానం గులాబీ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.
తెలంగాణ ఉద్యమ పార్టీగా సక్సెస్ అయ్యి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ కాలం నుంచి పార్టీ అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ వాయిస్, బలంగా వినిపించి తెలంగాణ ప్రజల మన్ననలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పాటుకు ముందు, తర్వాత గులాబీ రాజకీయ ఎత్తుగడలు సక్సెస్ అవ్వడానికి, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అందించిన సహకారం కూడా ఒక కారణమన్నది రాజకీయ విశ్లేషకుల భావన. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన కాలంలో, శాంతి భద్రతలు కాపాడుతూ ఉద్యమకారులకి గవర్నర్ మేలు చేశారనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రభుత్వానికి గవర్నర్ అందించిన సలహాలు, సూచనలు తమకు చాలా ఉపయోగపడ్డాయని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర్ర మంత్రివర్గ కూర్పు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ఇలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి పుల్ సపోర్ట్‌గా, కేసీఆర్‌కు నరసింహన్ అండగా నిలిచారని, ఆ పార్టీ నేతల భావన. కానీ ఇఫ్పుడు గవర్నర్ మారారు. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, కొత్తకొత్త చర్చలను రాజేస్తోంది.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రభుత్వ పథకాలు ఒక కారణమని, ఆ పథకాలు సక్రమంగా అమలు ఎలా చేయాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గవర్నర్ సలహాలు ఇచ్చేవారని పార్టీ నేతలు మాట్లాడుకుంటుంటారు. ఉద్యమకాలం నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు గవర్నర్‌గా నరసింహన్ అందించిన సూచనలు, మరిచిపోలేమని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ప్రతి సందర్బంలోనూ కేసీఆర్ గవర్నర్‌ను కలిసి సలహాలు, సూచనలు తీసుకునే వారని గులాబీ పార్టీ పెద్దలు చెబుతుంటారు. రాష్ట్ర్ర విభజన అంశాలు, అటు చంద్రబాబు సమయంలో, ఇటు జగన్ మోహన్ రెడ్డి హయాంలో కూడా, తెలంగాణకు అనుకూలంగా అనేక సమస్యలు పరిష్కరించారని గుర్తు చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో, గవర్నర్ వైఖరి, ప్రభుత్వానికి సానుకూలంగా ఉండటంతో సీఎం కేసీఆర్్కు, గవర్నర్ నర్సింహన్‌కు మధ్య సఖ్యత నెలకొంది. కేంద్రానికి, రాష్ట్ర్రంపై అనుకూల రిపోర్టులు ఇచ్చి మోడీ సర్కార్‌కు, తెలంగాణ సర్కార్‌కు మంచి రిలేషన్స్ కుదరడంలో, గవర్నర్ పాత్ర చెప్పుకోదగ్గదని రాజకీయ వర్గాల విశ్లేషణ.
కేంద్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని ముందే పసిగట్టి, కేసీఆర్ తెలిపే వారట. అయితే ఇప్పుడు సుధీర్ఘ కాలం పనిచేసిన నరసింహన్ పదవికాలం ముగియడంతో, ఆయన స్థానంలో తమిళసై సౌందర రాజన్‌ను, తెలంగాణ గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. నరసింహన్‌కు మరికొన్ని సంవత్సరాలు పొడిగించి, గవర్నర్‌గా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన చోటులో సౌందర రాజన్‌కి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
తమిళసై సౌందర రాజన్‌ని గవర్నర్‌గా కేంద్రం నియమించడంలో, బిజేపీ పార్టీ వ్యూహం ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బిజేపీ, తమిళసైని గవర్నర్‌గా నియమించింది అని గులాబీ నేతలు అనుమానిస్తున్నారు. గత గవర్నర్‌లాగా సపోర్ట్ చేయకుండా, సౌందర రాజన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదని అనుమానిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను, బీజేపి అధిష్టానానికి ఆమె చేరేవేసే అవకాశం ఉందని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు.
మొత్తానికి గవర్నర్ మార్పు తథ్యమని కొద్దికాలంగా బీజేపీ నేతలు చెప్పిందే నిజమైంది. కొత్త గవర్నర్ వస్తారు, టీఆర్ఎస్ సర్కార్‌కు ఇక గడ్డురోజులే అని చేసిన ప్రచారం ఎంత వరకు నిజమవుతుంతో కాలమే తేల్చాలి. కొత్త గవర్నర్ తమిళసై టీఆర్ఎస్‌తో సఖ్యతతో ఉంటారా లేక రాష్ట్ర్ర బీజేపీ ఎదుగుదలకు పరోక్ష సహకారం అందిస్తారా అన్నది చూడాలి.