హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
Hyderabad: ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు
Hyderabad: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్ నగరం మధ్యాహ్నం వరకు ఎండలతో మండిపోగా.. మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలోని పలుచోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.
హైదరాబాద్‌లోని అబిడ్స్, నాంపల్లి, కోటి,సుల్తాన్ బజార్, బేగం బజార్, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు సికింద్రాబాద్ పరిధిలో కూడా వాన దంచికొడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్ లాలాగుడ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.
ఇక తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నాలుగురోజుల పాటు రాష్ట్రంలో వడగండ్ల వానలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నాలుగురోజుల పాటు భారీ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.