కొన్ని రోజుల క్రితం రాజేంద్రనగర్, కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై జనాన్ని హడలెత్తించి పరుగులు పెట్టించి తప్పించుకుపోయిన చిరుత మళ్ళీ ప్రత్యక్షం అయింది. సరిగ్గా ఎక్కడైతే చిరుత కనిపించకుండా పోయిందో ఆ ప్రదేశానికి కొంచెం దగ్గరలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత కదలికలు నిన్న అర్థరాత్రి దాటిన తరువాత కనిపించింది. దీనికంటే కొన్ని గంటల ముందు నల్గొండ జిల్లాలోని మర్రిగుడా ప్రాంతంలో జు పార్క్ టీం ఒక చిరుతను పట్టుకున్నారు.
ఇక ఇక్కడ కనిపించిన చిరుత విషయమై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి సమయంలో చిరుత అరుపులు విన్న వారు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను బయటకు రాకుండా అప్రమత్తం చేశారు.
జూపార్కు కు చెందిన దాదాపుగా 50 మంది అధికారులు, సిబ్బందితో కూడిన బృందం కొంత కాలంగా ఈ చిరుత కోసం చేయని ప్రయత్నాలు లేవు. బోనులు పెట్టారు.. జంతువులను ఎరగా ఉంచారు.. జాగిలాలతో గాలించారు. అయినా, చిరుత జాడ మాత్రం దొరకలేదు. చివరి సారిగా హిమాయత్ సాగర్ వద్ద నీరు తాగుతుండగా దీనిని గుర్తించారు.
నిన్న ఉదయం నుంచీ ఒక చిరుత మొయినాబాద్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, రాత్రి 8 గంటల సమయంలో యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సీసీ కెమెరాలలో కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల ప్రజలకు వాట్సప్ ద్వారా సమాచారం అందించి అప్రమత్తం చేశారు.
ప్రస్తుతం చిరుతను బంధించడానికి జూపార్క్ బృందం శ్రమిస్తోంది.
హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి