రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకుండా టీ కాంగ్రెస్ సీనియర్ మోస్ట్‌లు ఏకమవుతున్నారా? హస్తినలో మకాం వేసి, అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారా? ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటూ, సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారా? రేవంత్‌కు పీసీసీ ఇస్తారో లేదో కానీ, ఈ మొత్తం పొగలకు, సెగ రాజేసింది ఒక్క ఫోటో తెలుసా ఆ ఒక్క ఫోటో కారణంగానే, ఇప్పుడు టీ కాంగ్రెస్ పెద్దలు రగిలిపోతున్నారట. ఆ ఫోటో పట్టుకుని సోనియా గాంధీతో మాట్లాడేందుకు ఢిల్లీ బాట పట్టారట. ఇంతకీ ఏదా ఫోటో రేవంత్‌కు పీసీసీ రాకుండా అడ్డుకుంటున్న నేతలెవరు?
ఈ ఒక్క ఫోటో తెలంగాణ కాంగ్రెస్‌లో సెగలు రేపుతోంది. రేవంత్ రెడ్డి, ఆయన భార్య, కూతురు, అల్లుడు ఇలా రేవంత్ ఫ్యామిలీ సోనియా గాంధీతో దిగిన ఈ ఫోటో, తెలంగాణ కాంగ్రెస్ మొత్తం, కదిలివచ్చి ఢిల్లీలో లొల్లి చేసేలా చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ఒక్క ఫోటో వేడి పుట్టిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కుటుంబంతో ఫోటో దిగడంతో, ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమనే భావన, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఏమోగాని, సొంత పార్టీలో మాత్రం వేడిని రాజేస్తోంది. ఈ ఫోటో పత్రికులు, సోషల్ మీడియాలో రావడంతో, వెంటనే పార్టీలో సీనియర్లంతా ఢిల్లీలో మకాం వేశారనే చర్చ పార్టీలో సెగలు రాజేస్తోంది.
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథిని మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికే ఈ బాధ్యతలు ఇస్తారన్న టాక్ వచ్చింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం, టీ కాంగ్రెస్‌లోనే చాలామందికి నచ్చడం లేదట. సీనియర్లుగా ఉన్న వారు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వి.హనుమంతరావు అయితే, రేవంత్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పోస్టు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయనే కాదు పార్టీలో చాలా మంది సీనియర్లు సైతం పీసీసీ చీప్ పదవిపై కన్నేసి ఉన్నారు. అయితే పార్టీ కేడర్ మాత్రం, రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌కు ఈ పదవి ఇస్తేనే కేసీఆర్‌ను ఢీ కొట్టడానికి జోష్ వస్తుందని, పార్టీ బతుకుతుందని అంటున్నారట. నేతలు మాత్రం రేవంత్ లక్ష్యంగా పావులు కదుపుతూ, ఏవో ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి సోనియాగాంధీతో కుటుంబ సమేతంగా ఫోటో దిగడంతో, ఒక్కసారిగా పీసీసీలో కల్లోలం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఎవ్వరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సోనియాగాంధీ, కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఎందుకు ఇచ్చారనే చర్చ, పార్టీలో జోరుగా సాగుతోంది. అధిష్టానం రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం వల్లే, సోనియగాంధీ, రేవంత్ కుటుంబంతో కలిసి ఫోటో దిగారనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. దీంతో పార్టీలో సీనియర్లంతా చివరి ప్రయత్నంగా రేవంత్‌కు పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లంతా ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. సీనియర్లంతా పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలకు ఇవ్వాలని డిమాండ్ తెస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి, టీ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి తుపాను ఎలా తీరం దాటుతుందో.