తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాలుగు ఎన్ కౌంటర్లు.. రెండింటిలో సజ్జనార్ కీలకపాత్ర !

Update: 2019-12-07 06:59 GMT
ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్....ఈ పదం తెలంగాణకు కొత్తేమీ కాదు. నిజాం కాలం నుంచి కూడా తెలంగాణలో ఎన్ కౌంటర్లు కొనసాగాయి. నిజాం రాజ్యంలో కమ్యూనిస్టులు, ఆ తరువాత నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. తరువాతి కాలంలో దొంగలు, రౌడీలు, ఉగ్రవాదులు, అత్యాచారాలకు పాల్పడిన వారు సైతం ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. తాజాగా దిశ కేసులో నిందితులైన నలుగురు ఎన్ కౌంటర్ లో హతం కావడంతో ఎన్ కౌంటర్ మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్లపై స్పెషల్ ఫోకస్.

పోరాటాల గడ్డగా పేరొందిన తెలంగాణలో ఎన్ కౌంటర్లు నిజాం హయాంలోనే ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి ఎన్ కౌంటర్ సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో జరిగిందని చెబుతారు. 1948 మార్చి 14న నిజాం పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది తెలంగాణ సాయుధ పోరాటయోధులు అమరులయ్యారు. హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనమైన తరువాత కూడా ఎన్ కౌంటర్ల పరంపర కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఎన్ కౌంటర్లు జరిగాయి. వందల సంఖ్యలో నక్సల్స్ హతమయ్యారు. మొదట నక్సల్స్ కు మాత్రమే పరిమితమైన ఎన్ కౌంటర్లు ఆ తరువాత దోపిడీ దొంగలు, రౌడీలు, ఉగ్రవాదులు, రేపిస్టులకూ విస్తరించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015, 2016, 2019 లలో నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినవే కావడం ఓ విశేషం.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎన్ కౌంటర్ 2015 ఏప్రిల్ 7న జరిగింది. వరంగల్ జైల్లో ఉన్న ఉగ్రవాది వికారుద్దీన్ తోపాటు అతని అనుచ‌రులు అంజ‌ద్, జ‌కీర్, హిజార్ ఖాన్, హనీఫ్ ల‌ను హైద‌రాబాద్ కు తరలిస్తుండగా జనగామ సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. వికారుద్దీన్ తో పాటుగా ఆయన అనుచరులు ఈ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. 2015లోనే మరో ఎన్ కౌంటర్ జరిగింది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో శృతి అలియాస్ మహిత, విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సూర్యం మరణించారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. మూడో ఎన్ కౌంటర్ గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించింది. ఈ ఎన్ కౌంటర్ లో ప్రస్తుత సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలకపాత్ర పోషించారు. అప్పట్లో ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఐజీగా ఉన్నారు. షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మాఫియా డాన్ గా నయీం దందాలు శృతి మించాయి. వేల కోట్ల రూపాయల మేరకు ఆస్తులను నయీం కూడబెట్టాడు. పోలీసులు మొదలుకొని రాజకీయ నాయకుల వరకూ ఎంతోమంది నయీంకు సహకరించినట్లుగా ఆరోపణలొచ్చాయి.

ఇక తాజాగా వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులోనూ ఎన్ కౌంటర్ జరిగింది. దిశను పెట్రోల్ తో కాల్చివేసిన స్థలంలోనే ఆమె దశదినకర్మ రోజునే ఈ ఎన్ కౌంటర్ జరగడం యాదృచ్ఛికమే అయినా ఓ విశేషంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వికారుద్దీన్ తో ప్రారంభమైన ఎన్ కౌంటర్ పరంపర దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసే వరకూ కొనసాగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నాలుగు ఎన్ కౌంటర్లలో రెండింటిలో సజ్జనార్ కీలకపాత్ర పోషించడం విశేషం.

Full View  

Tags:    

Similar News