ఆదిలాబాద్‌ బీజేపీని షేక్ చేస్తున్న మరో రాజాసింగ్ ఎవరు?

Update: 2019-07-08 09:26 GMT

అతను మొన్నటి వరకు సౌమ్యుడు. మాట నిదానం, వ్యవహారంలో చురుకుదనం. ఒకవర్గం ప్రజల కోసం పోరాడుతూ గెలిచాడు. ఇప్పుడు మరిన్ని వర్గాలకు చేరేందుకు, 2 పాయింట్ ఓ వెర్షన్‌లోకొచ్చాడు. సౌమ్యుడున్న ముద్ర చెరిపేసి, కరకుదనానికి కేరాఫ్‌ అడ్రస్‌‌గా మారుతున్నాడు. స్వీటులాంటి మాటలు పక్కనపెట్టి ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అడవుల ఖిల్లా ఆదిలాబాద్‌లో కాంట్రావర్సియల్ కామెంట్లతో కాకరేపుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆదిలాబాద్ బీజేపీకి, మరో రాజాసింగ్‌లా తయారయ్యాడు. సౌమ్యుడు ఎందుకింత కఠినమయ్యాడు కొన్ని వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు దీని వెనక ఆ గిరిజన నాయకుడి ఆలోచనేంటి?

ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు గిరిజన నాయకుడు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడులక్షలపైగా ఉన్న సామాజిక వర్గానికి ప్రతినిధి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఆదివాసీ హక్కుల పోరాటంతో, ఆ వర్గంలో సోయం బాపురావుకు ఎనలేని పట్టుంది. ఆ వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సోయంకున్నాయి. అందువల్లనే సోయం బాపురావు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం బలంలేని బిజెపి తరపున పోటీ చేసినా, ఆ సామాజికవర్గం వాళ్లంతా గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించారు. దాంతో కంచుకోటలాంటి టిఆర్‌ఎస్ కోటను బద్దలు చేసిన నాయకుడిగా జనంలో స్పెషల్ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు సోయం.

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గాదేగూడ విజయోత్సవ ర్యాలీలో, ఆదివాసీ బాలికలు, అమ్మాయిలపై వేధింపులకు పాల్పపడుతున్న వారిపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ఆదివాసీ అమ్మాయిలను వేధిస్తే, వేధించిన వారి తలలు నరికివేస్తారని, ప్రత్యేకంగా ఓవర్గానికి చెందిన పోకిరీలను హెచ్చరించారు సోయం. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు కొన్ని వర్గాల నేతలు. పోలీసులు విచారణ జరిపి ఎంపి సోయంపై కేసుల కూడా ఫైల్ చేశారు. అయితే వివాదాస్ప ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లు సోయం వ్యాఖ్యలను విపరీతంగా ప్రచారం చేశారు. దాంతో ప్రత్యర్థి పార్టీలు ఆ వ్యాఖ్యలతో, సోయంకు నష్టం జరుగుతుందని భావిస్తే, దానికి రివర్స్‌గా మారిందన్న ప్రచారమూ జరుగుతోంది.

సోయంకు అతివాద వర్గాల నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేస్తాయని కొందరు భావిస్తే, ఆదివాసీల నాయకుడైనా, ఈ ఘటనతో సోయం అందరి వాడిగా మారారని ప్రత్యర్థి పార్టీలు ఆందోళన చెందుతున్నాయట. ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరితే, ఎక్కడ ఆయనకు మరింత ప్రతిష్ట పెరుగుతుందని కనీసం చర్యలు తీసుకోవాలని సైతం కోరవద్దని ప్రత్యర్థి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయట.

అయితే సోయం చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసినవి కావట. వ్యూహత్మకంగా చేసిన కామెంట్లని, బిజెపి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యాఖ్యలతో బిజెపి వర్గాలతో పాటు, మిగతా వర్గాల్లోనూ, సోయంకు మంచి సానుభూతి పెరిగింది. తనను వ్యతిరేకించే వర్గాలను సైతం, అతివాద వ్యాఖ్యలతో సోయం ఆకట్టుకున్నారని, ఆయన అనుచరులు సంతోష పడుతున్నారట. అంతేకాదు, బీజేపీలో మరో ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌తోనూ ఆయనను పోలుస్తున్నారట.

సోయం బాపురావును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పోలుస్తున్నారట ఆ‍యన అనుచరులు. ఆదిలాబాద్ రాజాసింగ్‌గా కీర్తిస్తున్నారట. ఒక వర్గం దూరమైనా, మిగతా వర్గాలన్నీ అండగా మారుతున్నాయట. ఈ పరిణామాలు, వ్యాఖ్యల ప్రకంపనలు భవిష్యత్‌లో సోయంబాపురావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పడానికి తోడ్పపడుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజాసింగ్ లాంటి వ్యక్తులను తలపించే మాదిరిగా సోయం తయారవుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. పైగా ఆదిలాబాద్ రాజాసింగ్‌గా సోయంబాపురాను అనుచరులు పిలుస్తున్నారట.

అయితే మొన్నటి వరకు సౌమ్యంగా ఉన్న సోయం బాపురావు, బీజేపీలో చేరడంతో ఆ పార్టీ తరహా దూకుడు రాజకీయాన్ని వంటబట్టించుకున్నారని స్థానిక నేతలు అంటున్నారు. రాజకీయ, సామాజిక, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా బలపడాలన్నది కమలం సిద్దాంతమని, అసలే ఉనికేలేని ఈశాన్య రాష్ట్రాలకూ అలానే విస్తరించిందని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలోనూ విస్తరించాలనుకుంటున్న బీజేపీ, ఇలాంటి కామెంట్ల కాకను మరింత పెంచాలనుకుంటోంది. ఆ వ్యూహంలో భాగంగానే, ఆదిలాబాద్‌లో సోయం బాపురావుకు బీజేపీ స్కూల్‌ ఆఫ్‌ డైలాగ్స్‌‌‌ వంటబట్టేలా హితబోధ చేసిందని చెబుతున్నారు. అందుకే సౌమ్యుడైన సోయంలో, ఇంత కరకైన మాటలు ధ్వనిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

ఆదిలాబాద్ రాజాసింగ్‌ అంటూ సోయంను పిలుచుకుంటున్నా, ఫ్యూచర్‌లో ఇలాంటి బ్రాండ్‌ మైనస్ అవుతుంది తప్ప, ప్లస్ కాబోదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి సోయం కాంట్రావర్షియల్ కామెంట్లు చేశాడని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ కామెంట్లకు కౌంటర్‌గా మిగతా వర్గాలు రెచ్చిపోతే, అది సమాజంలో అశాంతికి దారి తీసే ప్రమాదముందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆదిలాబాద్ రాజాసింగ్ ఇమేజ్‌ను సోయం ఎంజాయ్ చేస్తారో, లేదంటే సౌమ్యుడన్న తనదైన బ్రాండ్‌ను కంటిన్యూ చేస్తారో చూడాలి.

Full View 

Tags:    

Similar News