విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు..ఫీజుల సతాయింపు షురూ!

Update: 2020-06-17 11:35 GMT

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది హైదరాబాద్ లో నివసరించే పేరెంట్స్ పరిస్థితి. అసలే కరోనా దెబ్బకు విలవిలలాడుతుంటే స్కూల్ ఫీజులు కట్టాలంటూ యాజమాన్యాలు ఆదేశాలు పంపిస్తున్నాయి. పూట గడవడమే కష్టమైన ఈ పరిస్థితుల్లో ఫీజులెక్కడి నుంచి తేవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫీజుల వసూళ్ల కోసమే ఆన్ లైన్ క్లాసులను తెరపైకి తెచ్చారా అంటూ మండిపడుతున్నారు.

లాక్ డౌన్ అమలు నుంచి అన్ని పాఠశాలలను మూసివేశారు. కానీ విద్యాసంవత్సరం మొదలు కాకముందే కొన్ని యాజమాన్యాలు హడావుడి చేస్తున్నాయి. ఆన్ లైన్ క్లాస్ లంటూ పిల్లల ముందుకు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఫీజులు కట్టమని యాజమాన్యం నుంచి ఆదేశాలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

కరోనా, లాక్ డౌన్ అమలు కారణంగా చాలా మంది తల్లిదండ్రులకు పనిలేకుండా పోయింది. హైదరాబాద్ లో సామాన్యుల జీవితాలు మరీ దారుణంగా తయారయ్యాయి. ఇళ్ల కిరాయిలు కట్టలేక, బయటికి వెళ్లలేక సతమతమవుతున్నారు. ఏం తినాలో ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి ఇలాంటి సమయంలో ఫీజులంటే మా వల్ల కాదని చెబుతున్నారు. ప్రభుత్వం స్కూల్ ఫీజులు వసూలు చేయోద్దని ప్రకటించినా ప్రయివేట్ పాఠశాలల తీరు మారడం లేదంటూ ఆరోపిస్తున్నారు.

ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు పరిస్థితిని అర్థం చేసుకొని ఫీజుల కోసం వేధించకూడదని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఆన్ లైన్ క్లాసుల పేరిట విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసే పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. 

Tags:    

Similar News