వారి మధ్య మొన్నటి వరకూ నిప్పులు కక్కిన కోల్డ్ వార్ కాస్తా, ఇప్పుడు డైరెక్ట్ వార్‌గా మారుతోంది. గతంలో తెర వెనుక ఒకరిపై ఒకరు, కత్తులు నూరితే, ఇప్పుడు ఏకంగా కత్తి యుద్ధమే చేసేందుకు సై అంటున్నట్టు తెలుస్తోంది. ఒకరేమో స్వయానా ముఖ్యమంత్రికి నీడలాంటి వ్యక్తి, మరొకరు బిడ్డ లాంటి వ్యక్తి అసలు ఈ ఇద్దరు ఎవరు? ఏంటా ఎత్తులు, పైఎత్తులు, కత్తులు వాచ్ దిస్ స్టోరీ.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నంటి వుండే వ్యక్తి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. మరొకరు బిడ్డలాంటి వ్యక్తి పద్మా దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లాలో వీరిమధ్య ఆధిపత్య ముదురుతోంది. మొన్నటి వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై వీరిమధ్య పరోక్ష ఆధిపత్య పోరు సాగింది. ఇప్పుడు జలహారతిపై రగడ, ముదిరి పాకాన పడ్డంతో, ప్రత్యక్ష యుద్దం మొదలైంది.
మెదక్ నియోజకవర్గం కూచన్‌పల్లి, శేరి సుభాష్ రెడ్డి స్వగ్రామం. చుట్టు పక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు సీఎం సహకారంతో, కూచన్‌పల్లి గ్రామంలో గతేడాది 15 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మించారు శేరి ఇటీవల కురిసిన వర్షాలకు ఆ చెక్ డ్యామ్ పూర్తిగా నిండింది. చుట్టూ పక్కల గ్రామాల్లో ఎండి పోయిన బోర్లలో సైతం తిరిగి నీళ్లు రావడం ప్రారంభమైంది. ఒక మంచి ముహూర్తం చూసి జల హారతి ఘనంగా నిర్వహించాలని సుభాష్ రెడ్డి ప్లాన్ చేశాడట.
కానీ తనకంటే ముందుగానే స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెక్ డ్యామ్ వద్దకు వచ్చి పూజలు నిర్వహించారట. ఈ విషయం తెలుసుకున్న శేరి సుభాష్ రెడ్డి అవాక్కయ్యారట. తన స్వంత గ్రామంలో, తను నిర్మించిన చెక్ డ్యామ్ వద్ద, తనకు తెలియకుండా పూజాలేమిటని సుభాష్ రెడ్డి అసహనంతో రగిలిపోయారట.
ఆ నోటా ఈ నోటా సుభాష్ రెడ్డి అసహనం విన్న పద్మా దేవేందర్ రెడ్డి వర్గీయలు, జలహారతిపై స్పందించక తప్పలేదు. అయతే వేరే కార్యక్రమం గురించి గ్రామానికి వచ్చిన సందర్బంలో, గ్రామస్తులు చెక్ డ్యామ్ వద్దకు తీసుకెళ్లారని, అక్కడ జల హారతి చెయ్యాల్సి వచ్చిందని చెబుతున్నారట పద్మా అనుచరులు. పైగా ఇదేమి అధికారిక కార్యక్రమం కాదు కదా, అందర్నీ పిలవడానికి అని ఎదురు ప్రశ్నిస్తున్నారట.
చివరకు చేసేదేమిలేక మూడు రోజుల తర్వాత తన స్వగ్రామం కూచన్‌పల్లికి వెళ్లి చెక్ డ్యామ్ వద్ద ఘనంగా జల హారతి నిర్వహించారట ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి. పద్మా తీరుపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలని,కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న వీరిద్దరి మధ్య పోరు ఇప్పుడు బహిరంగాగానే మొదలైందని నియోజకవర్గ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎటుపోయి, ఎటు మలుపు తిరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారట ఇరువర్గాల అనుచరులు.