ఆయన చుట్టూ, గులాభీ గుభాలిస్తోంది. అందుకో రోజా పువ్వూ అంటూ కవ్విస్తోంది. అయినా, ఆ నాయకుడు, గులాబీ పరిమళానికి అస్సలు టెమ్ట్ కావడం లేదట. రోజా పువ్వు వంక చూపు తిప్పడం లేదట. ఎందుకంటే కమలం, మరింతగా టెమ్ట్ చేస్తోందట. లోటస్ అందుకుంటే, టోటల్ బిందాస్ అని హామీల పరిమళాలు వెదజల్లుతోందట. అందుకే గులాబీని కాదని కమలాన్ని అందుకోవడానికి, తెగ రెడీ అవుతున్నాడట ఓ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు. ఇంతకీ కమలం అందుకోబోతున్న ఆ హస్తవీరుడు ఎవరు?
మంచిర్యాల మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. కరడుగట్టిన కాంగ్రెస్ వాది గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోందని, రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం, స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. తమ పార్టీలో చేరాలంటూ ప్రేమ్ సాగర్‌ను ఆహ్వానించిందట టీఆర్ఎస్. పైగా ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ చేసిందని, మాజీ ఎమ్మెల్సీ అనుచరులు బయట ప్రచారం చేసుకుంటున్నారట. అయితే గులాబీ ఆకర్షించడం కంటే, కమలమే సాగర్‌ను టెమ్ట్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది.
అధికార పార్టీని కాదని, కమలం గూటికి చేరడానికి సిద్దమవుతున్నారట ప్రేమ్ సాగర్. తమ పార్టీలోకి రావాలని బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆహ్వనించారట. పైగా పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారట. దాంతో మాజీ ఎమ్మెల్సీ కమలం పార్టీలో చేరాలని దాదాపు నిర్ణయించుకున్నారన్న మాటలు, స్థానికంగా వినపడుతున్నాయి.
అయితే, ఎవరి సమక్షంలో అంటే, వారి సమక్షంలో పార్టీ మారేందుకు ప్రేమసాగర్‌కు ఇష్టంలేదట. కేవలం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే కమలం కండువా కప్పుకుంటానని, రాష్ట్ర బీజేపీ నేతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారట. చేరికలపై అనుచరులతో చర్చలు సైతం నిర్వహించారట సాగర్. కమలం పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అన్నీ అనుకూలంగా ఉంటే మంచిర్యాలలో భారీ సభ నిర్వహించి పార్టీలో చేరడానికి, మాజీ ఎమ్మెల్సీ సిద్దమవుతున్నారట.
అయితే మాజీ ఎమ్మెల్సీ తొలుత గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా తర్వాత వెనుకడుగు వేయడానికి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారో ఇవ్వరో గ్యారంటీ లేకపోవడం, భవిష్యత్తులో మంచిర్యాల ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని చెబుతున్నా, గతంలో టీఆర్ఎస్‌లో చేరిన రమేష్ రాథోడ్‌కు ఎదురైన అనుభవం, తనకూ తప్పదన్న అనుమానం సాగర్‌లో మొదలైందట. ఒకవేళ చేరిన తర్వాత టికెట్ ఇవ్వకపోతే ఏంటని రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందున్నారట. దాంతో రాని టికెట్ గురించి ఆలోచించడం కన్నా, గ్యారంటీగా టిక్కెట్ వచ్చే బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారట.
పైగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తన వ్యాపారాలు బాగా దెబ్బతీసిందని మాజీ ఎమ్మెల్సీ తెగ బాధపడుతున్నారట. అందుకే దేశవ్యాప్తంగా ఊపున్న పార్టీలో చేరాలని నిర్ణయించున్నారట ప్రేమ్ సాగర్ రావు. భవిష్యత్తులో కమలం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారట బిజెపి నాయకులు. అందుకే కమలం పార్టీలో చేరడానికి సిద్దమవుతున్నారట ప్రేమ సాగర్. మొత్తానికి గులాబీ గుభాళింపుకు అట్రాక్ట్ అవుతాడనుకుంటే, కమలం వికాసానికేఆకర్షిడవుతున్నారట ప్రేమసాగర్ రావు. చూడాలి, మున్ముందు నిజంగా ఏ పువ్వు పరిమళానికి దగ్గరవుతాడో.