మేయర్ కు జరిమానా విధించిన మంత్రి కేటీఆర్

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, బ్యానర్ల కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది.

Update: 2020-05-23 05:06 GMT

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, బ్యానర్ల కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది. నగరంలో అనధికారికంగా పెట్టే ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాట్లను నిషేధించాలని గతేడాది జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకుంటామని కూడా జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అన్నట్టుగానే నిబంధనలను పాటించని వారిపై చర్యలు కూడా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఓ మహిళా కార్పోరేటర్ కు స్వయాన మంత్రి కేటీఆర్ రూ.20వేలు జరిమానా విధించారు. ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని సుల్తాన్‌నగర్‌బస్తీ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ బస్తీ దవాఖానాను ప్రారంభించడానికి వెళ్లారు. ఆయన అక్కడ చేరుకోగానే దిగగానే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసారు. అది చూసిన మంత్రి వెంటనే ఎవరు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగిస్తేనే బస్తీ ఆస్పత్రిని ప్రారంభిస్తానని ఆయన అధికారులకు తెలిపారు.

దీంతో అధికారులు వెంటనే జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–19 డీఎంసీ రమేష్‌ను, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ బిందును పిలిపించి ఫ్లక్సీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన స్థానిక కార్పొరేటర్‌ షహీన్‌ బేగం అని తెలిసి తక్షణమే ఆమెకు మంత్రి కేటీఆర్ రూ.20 వేలు జరిమానాను విధించారు. అధికారులు అందుకు సంబంధించిన రసీదును కూడా ఆమెకు అందజేశారు. ఆ తరువాత మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానను చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆ తరువాత స్థానికంగా ఏర్పాటు చేసిన దవాఖానాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News