Karimnagar: ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలేమంటున్నారు..
Karimnagar: ఆరు దశాబ్దాల కల సాకారమై ఏడేళ్లు గడిచింది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాటంలో కీలక ఘట్టాల్లో ఒకటైన సింహగర్జనకు కరీంనగర్ జిల్లా నీరాజనం పట్టింది.
Karimnagar: ఆరు దశాబ్దాల కల సాకారమై ఏడేళ్లు గడిచింది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాటంలో కీలక ఘట్టాల్లో ఒకటైన సింహగర్జనకు కరీంనగర్ జిల్లా నీరాజనం పట్టింది. నాటినుంచి నేటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమానికి, ఉద్యమ పార్టీకి ఊపిరిగా నిలిచింది. మరి ఈ ఉద్యమ ఖిల్లా ప్రజల ఆకాంక్షలు ప్రత్యేక రాష‌్ట్రంలో నెరవేరేయా..? ఏడేళ్ల పాలనలో జరిగిన పాలనతో కరీంనగర్ జిల్లాలో వచ్చిన మార్పులేంటి..? ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలేమంటున్నారు. ప్రతిపక్షాలేమంటున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో కరీంనగర్ గడ్డది కీలక పాత్ర. ఉద్యమంలో ముఖ్య భూమిక వహించిన కరీంనగర్‌ను లండన్ ,డల్లాస్‌గా చేస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కానీ ఆ హామీల అమలుకు మోక్షమెప్పుడని ఉద్యమ గడ్డ ఎదురుచూస్తోంది. బోర్డులు మారాయే తప్ప అభివృద్ధి శూన్యమంటున్నారు అక్కడి ప్రజలు. విద్య, వైద్యంతో పాటు ఉద్యోగాల కల్పన విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఐదేండ్లలో కేవలం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం బాధాకరమని చెబుతున్నారు.
కేజీ టు పీజీ విద్య అన్న ప్రభుత్వం కేవలం ఐదు లక్షల మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు జిల్లా వాసులు. ఏడు వైద్య కళాశాలలకు శంకుస్థాపనలు అని చెప్పిన సీఎం కరీంనగర్ ఊసెత్తకపోవడంపై మండిపడుతున్నారు. ఏ ఉద్యమం మొదలుపెట్టినా కరీంనగర్ నుంచే ప్రారంభించే కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదంటున్నారు విపక్ష నేతలు. ఉద్యోగాల భర్తీ చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేతల ప్రయోజనాల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం నుండి మల్లన్నసాగర్ కు నీళ్లు పంపింగ్ చేస్తున్నారని కానీ ఉమ్మడి జిల్లాలో చెరువులు ఎండిపోతున్నాయని రైతాంగం ఇబ్బందులు పడుతోందని చెబుతున్నారు. కాళేశ్వరం జలాలు దక్షిణ తెలంగాణకు పంపించే ప్రక్రియ మొదలైతే ఇక్కడి రైతుల భవితవ్యం ఏంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.