ఆర్టీసీ సమస్యకు సీఎం కేసీఆర్ ముగింపు పలికారు. రాష్ట్రంలో 52 రోజులుగా సుదీర్ఘంగా సమ్మెలో పాల్గొని విధులకు దూరమైన 48 వేల మంది కార్మికులకు తిరిగి ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఇవాళ ఉదయం నుంచే ఆనందంగా విధుల్లో చేరవచ్చని ప్రకటించారు. తాత్కాలికంగా విధులు నిర్వహించిన వారికి కూడా భవిష్యత్తులో లబ్ది చేకూర్చే నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల కథ సుఖాంతమైంది. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరడానికి కేసీఆర్ అంగీకరించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో అక్టోబర్ 5న సమ్మె ప్రారంభించిన కార్మికులు రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వెనక్కి తగ్గారు. హైకోర్టు కూడా అశక్తతను వ్యక్తం చేయడంతో చివరకు సమ్మె విరమించారు. సమ్మెకు దిగిన కార్మికులే తమను విధుల్లో చేర్చుకోండి మహాప్రభో అంటూ కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీ సమ్మె కార్మికులకు ఎంతమాత్రం ఉపయోగపడకపోగా కేసీఆర్ సర్కారుకు మాత్రం ఎన్నో విధాలుగా ఉపయోగపడింది.
ఆర్టీసీ కార్మికులను పెద్ద మనసుతో క్షమించడం ద్వారా కేసీఆర్ మళ్లీ వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఉద్యోగాల్లో చేరిన వారికి జీతాల కోసం 100 కోట్లు మంజూరు చేస్తామన్న కేసీఆర్ ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా ఆయన చెప్పినట్టు కార్మికులు నడుచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆర్టీసీ కార్మికులంతా తమ వాళ్లే అని చెప్పిన కేసీఆర్ మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబీకులకు ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించారు. సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలను బాధ్యుల్ని చేశారు. ఇక మీదట ప్రతిపక్షాల మాటలను కార్మికులెవరూ నమ్మొద్దనే సంకేతాలను పంపారు.
ఆర్టీసీ సంఘాల పట్ల మండిపడ్డ సీఎం ఇక మీదట ఆర్టీసీ సంఘాలను కార్మికులు పట్టించుకోవద్దన్నారు. ఒక్కో డిపోకు ఇద్దరు చొప్పున ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. కార్మికులు తమ మాట వింటే సంస్థను సింగరేణిలా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీ యూనియన్లపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మిగతా ఉద్యోగ సంఘాలకు కూడా కేసీఆర్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా తీవ్రంగా ఇబ్బందులకు గురైంది కార్మికులే కాదు, సామాన్యులు కూడా. దీంతో ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరడం అందరికీ ఊరటనిస్తుంది. ఆర్టీసీ మనది కాబట్టి సంస్థను కాపాడుకోవడానికి ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. తన మీద ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఇది మన సంస్థ కోసమంటూ కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున ఛార్జీలను సోమవారం నుంచి పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు.
గతంలో ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్లు విధించి, హెచ్చరికలు జారీ చేసిన కేసీఆర్ ఇప్పుడు సొంత బిడ్డల్లా వారిని దగ్గరకు తీసుకున్నారు. తద్వారా తండ్రి హోదాలో ఉన్న తాను ఏం చేసినా మీ మంచికోసమేనని చాటారు. మొత్తానికి ఆర్టీసీ సమ్మెను తనకు అనుకూలంగా మలుచుకున్న కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి తెలంగాణ రాజకీయాల్లో తనకు సాటెవరూ లేరని చాటి చెప్పారు.