ఆయన ఓటమి ఎరుగని నేతగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకుంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మాత్రం ఇంకా ఏదో అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధినేత సదరు ఎమ్మెల్యేను విప్‌గా గుర్తించినా, ఆయన మాత్రం పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ససేమిరా అనడం వెనుక అసలు కారణమేంటి..? గంపెడంత ఆశ అందని ద్రాక్షలా మారడమే సదరు నేత అసంతృప్తికి కారణమా...? గుర్తింపు సమస్య ఆయన్ను వెంటాడుతుందా...? ఇంతకీ ఎవరాయన?
కామారెడ్డి నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు గంప గోవర్ధన్. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీని పలుమార్లు ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గంప గోవర్ధన్ కొన్నాళ్లుగా మూడీగా ఉంటున్నారట. అధికారులపై చిర్రుబుర్రులాడుతున్నారట. కార్యకర్తలు, ముఖ్య నేతలతో అంటీముట్టనట్లు ఉంటున్నారట. జిల్లాలో సీనియర్ గా ఉన్నా తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనే ఫీలింగ్ లో సదరు ఎమ్మెల్యే గుర్తింపు సమస్యతో బాధపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
2009 టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన గోవర్ధన్, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశించిన గంప గోవర్ధన్ కు, విప్ తో సరిపెట్టారు. 2018 ఎన్నికల్లోనూ షబ్బీర్ అలీపై విజయం సాధించిన గంప గోవర్ధన్ కు మంత్రి పదవిఖాయం అని అందరూ భావించారు. ఐతే మరోసారి ఆయన ఆశలపై నీళ్లు చల్లి విప్ పదవి తిరిగి కట్టబెట్టారట. ఐతే ఆయన మాత్రం ఇప్పటికీ విప్ గా బాధ్యతలు చేపట్టలేదట. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారట. నారాజ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారట. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అధికారుల తీరుపై ఒంటికాలితో లేచారట. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా బాన్సువాడ నుంచి గెలిచిన పోచారం, కామారెడ్డి నుంచి గెలిచిన గంప గోవర్ధన్ అత్యంత సీనియర్లు. పోచారం శ్రీనివాసరెడ్డిని స్పీకర్ గా అత్యున్నత పదవి కట్టబెట్టిన సీఎం తనను మాత్రం ఇంకా గుర్తించడం లేదని సదరు ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నారట. పైగా జిల్లాలో అధికారులు తన మాట వినడం లేదని, లోలోపల కుమిలిపోతున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది. మంత్రి పదవి ఖాయమని చివరి వరకు ప్రయత్నించిన గంపకు, నిరాశ ఎదురుకావడంతో ఆయన నారాజ్ లో ఉన్నారటే టాక్ నడుస్తోంది. విప్ తో ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేసినా సదరు ఎమ్మెల్యే మాత్రం ఇంకా ఆ పదవి చేపట్టలేదట. గంపా నారాజ్ త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారట. ఇప్పటి వరకు మున్సిపాలిటీపై సొంత బలంతో జెండా ఎగురవేయని అధికార పార్టీకి గంప అలక నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదని పార్టీ వర్గాలు బహాటంగా చెబుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న పొలిటికల్ సైలెన్స్ ను బ్రేక్ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను కూల్ చేస్తారో లేదో చూడాలి.