హుస్సేనీఆలం ఎస్‌బీఐ బ్యాంకు మూసివేత
కరోనా మహమ్మారి కారణంగా మూసాబౌలీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది.
కరోనా మహమ్మారి కారణంగా మూసాబౌలీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో పంజేషా యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రానా తబస్సుం బ్యాంకు సిబ్బందిని అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. బ్యాంకులో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి దగ్గరినుంచి మేనేజర్ వరకు అందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించడంతో బ్యాంక్ లావాదేవీలు స్తంభించిపోయాయి. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బంధికి కరోనా రావడంతో ఇప్పటి వరకు ఈ బ్యాంకుకు వెళ్లిన ఖతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంక్ ఉద్యోగికి రక్త పరీక్షలు నిర్వహించగా ఈ నెల 3న కరోనా పాజిటివ్ అని రిపోర్టులు రావడంతో అటు తోటి ఉద్యోగులతో పాటు ఖాతాదారులు నివ్వెర పోయారు. బ్యాంక్ సిబ్బందితో దగ్గరగా మెలిగిన వారందరూ తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఈ నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉండని కారణంగా బ్యాంక్‌ను మూసివేసినట్లు సంబంధిత అధికారులు బ్యాంక్ వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేసారు. ఇక పోతే కరోనా సోకిన వ్యక్తితో పాటు పచిచేసిన సిబ్బందికి కరోనా లక్షణాలుంటే వెంటనే రక్త పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక బ్యాంకు మూత పడినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, యునోతో పాటు ఏటీఎంలు పని చేస్తాయని అధికారులు తెలిపారు. అత్యవసరంగా డబ్బులు డ్రా చేసుకోవాలనుకునే వారు, బ్యాంకు సేవలను పొందాలనుకునే ఖాతాదారులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని నోటీసు బోర్డులో సూచించారు. కోట్ల అలీజా, మీరాలంమండిలలోని బ్రాంచ్‌లను అత్యవరమైన సేవల కోసం సంప్రదించవచ్చన్నారు.