హరిత హారంలో 50 లక్షల మొక్కలు నాటి, సంరక్షించాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్
వానాకాలం మొదలయింది. రాష్ట్రంలో త్వరలో హరిత హారం కార్యక్రమం కూడా మొదలవనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ బుధవారం జీహెచ్‌ఎమ్‌సీ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించటంలో 30 వేల మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం 50 లక్షల మొక్కలు నాటి, సంరక్షించాలని నిర్దేశించిందని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే గుంతలు తీయించి, మొక్కలు నాటాలని తెలిపారు. అంతే కాదు వాటి సంరక్షణ కోసం ప్రతి లొకేషన్‌లో ఒకరిని ఇంచార్జిగా నియమించాలని సూచించారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు కనిపించాలని సూచించారు. అదే విధంగా నగరానికి నడి మధ్యలో ఉన్న మూసీకి రెండు పక్కల వెదురు రకాల మొక్కలు నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కను రక్షించుటకు ఫెన్సింగ్ వేయడం, నీరు పోయడం, కలుపుతీత పనులను పరిశీలించాల్సిన బాధ్యత ఇంచార్జి అధికారిదే అని సూచించారు. చెరువు కట్టలకు ఇరువైపులతో పాటు, నీరు నిలవని ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటాలని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు పక్కన స్థలం తక్కువగా ఉంటే సంబంధిత ఇంటి యజమానితో మాట్లాడి, ప్రహరీ గోడకు లోపల మొక్కలు నాటించాలని తెలిపారు. అదే విధంగా స్మశాన వాటికల ప్రహరీ గోడలు గ్రీన్ కర్టెన్స్‌ను తలపించేలా ప్రత్యేకమైన మొక్కలు నాటాలని సూచించారు. 'హరితహారం అమలుకు వార్డు, లొకేషన్ వారీగా ప్రణాళిక చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. కార్పొరేటర్లతో చర్చించి వార్డు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించామన్నారు.