MLC ELections 2021: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
MLC ELections 2021: ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి * నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో బరిలో 71 మంది అభ్యర్థులు
MLC ELections 2021: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిలకకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల అధికారులకు పోలింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్, రిటర్నింగ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తైనట్లు అధికారులు చెప్పారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో చోట వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఇతర కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, ఇతరాల ద్వారా వీడియోగ్రఫీ చేయిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బ్యాలెట్ పత్రాలు భారీ సైజులో ఉన్నాయని ఇందుకోసం జంబో బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రానికి ఒకటి చొప్పున, పదిశాతం అదనంగా సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఇక ముందు జాగ్రత్తగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒకటి లేదా రెండు పెద్ద బ్యాలెట్ బాక్సులను కూడా ఇస్తున్నట్లు సీఈఓ తెలిపారు. పోలింగ్ రోజు అభ్యర్థికి ఇప్పటికే అనుమతించిన రెండు వాహనాలకు తోడు అదనంగా ప్రతి జిల్లాకు మరో వాహనం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ తెలిపారు. కొవిడ్ నిబంధనల అమలు కొవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని శశాంక్ గోయల్ అన్నారు. ఓటుహక్కును ఆపేందుకు ఎవరికీ వీల్లేదని ఓటుహక్కు వినియోగించుకునేలా యాజమాన్యాలు అవకాశం కల్పించాలని సీఈఓ సూచించారు.
ఇప్పటి వరకు దాదాపు 50 వరకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పటిష్ఠత కోసం అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ హెచ్చరించారు.