Telangana: సవాళ్ల రాజకీయం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రైతుభరోసాపై మాటలయుద్ధం

Telangana: రైతు భరోసా నిధులు పడటం లేదంటోన్న బీఆర్ఎస్‌

Update: 2024-05-05 06:07 GMT

Telangana: సవాళ్ల రాజకీయం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రైతుభరోసాపై మాటలయుద్ధం

Telangana: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. రైతు ఎజెండాతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య.... గాడిద గుడ్డు అంశంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతల మధ్యే డైలాగ్ వార్ సాగుతుండటంతో తెలంగాణలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్‌.. లోక్‌సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో తమ సత్తా నిరూపించుకోవాలనే భావనతో ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కదన రంగంలోకి దిగిన గులాబీ దళపతి.. అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రైతు ఎజెండాగా ప్రచారం చేస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇక రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌ ఎటాక్ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి దోచుకున్నారని.. ఖజానా ఖాళీ చేసి రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈనెల 8లోపు రైతు భరోసా డబ్బులు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని.. లేదంటే తాను ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మధ్య గాడిద గుడ్డు వార్ నడుస్తోంది. పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ కాంగ్రెస్ నేతలతో పాటు సీఎం రేవంత్ కూడా ప్రచారాల్లో చెబుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చింది.. 2014 నుండి 2024 వరకు ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని.. కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటిదాకా గాడిదగుడ్డు ఇచ్చిందంటూ.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. 

Tags:    

Similar News