కొండగట్టులో పెద్దఎత్తున మాలవిరమణ చేస్తున్న స్వాములు
Hanuman Jayanti: హనుమాన్ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Hanuman Jayanti: తెలంగాణ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోన్ని అన్ని హనుమాన్ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం రామనామస్మరణతో మారుమోగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వాములు దీక్ష విరమణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్ష విరమణ చేసేందుకు అర్ధరాత్రి నుంచి కొండపైకి చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారుల తెలిపారు. కొండగట్టు గుట్టపై పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇటు మెట్‌పల్లిలోని కాశీబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి దూప, దీపనైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణమంతా హనుమాన్ నామస్మరణతో మారుమోగింది.