Dharmapuri Srinivas: సోనియా గాంధీ ఇంటికి అపాయింట్ మెంట్ లేకుండానే వెళ్లే లీడర్... ఆయన చెప్పినట్టే తెలంగాణ రోడ్ మ్యాప్
Dharmapuri Srinivas: 2004 ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డీఎస్ కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
Dharmapuri Srinivas: ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు తెలుగుదేశానికి ఎదురేలేదనే సమయంలో సైకిల్ చక్రాలు విరగ్గొట్టారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి స్వంత గూటికి చేరారు. ధర్మపురి శ్రీనివాస్ ను శీనన్న, డీఎస్ అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. కొంతకాలంగా అస్వస్థతగా ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు.
రిజర్వ్ బ్యాంక్ లో క్లర్క్ గా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్
ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ గా పిలుచుకొనే ఆయన నిజామాబాద్ జిల్లా వేల్పూరు లో 1948 సెప్టెంబర్ 25న పుట్టారు. స్వగ్రామంలోనే ప్రాధమిక విద్యాభ్యాసం సాగింది. హైద్రాబాద్ నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ చదివారు. విద్యాభ్యాసం తర్వాత కొంత కాలం ఆయన రిజర్వ్ బ్యాంకులో క్లర్క్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు అభిమానం. అప్పటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అర్గుల్ రాజారాం స్పూర్తితో రిజర్వ్ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. నిజామాబాద్ కేంద్రంగా చేసుకొని రాజకీయాలు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఆయన తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో తొలిసారి ఆయన నిజామాబాద్ నుండి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1999, 2004 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఏపీలో కాంగ్రెస్ వరుస విజయాలు
నారా చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 1995 నుండి 2004 ఎన్నికల వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పట్లో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారనే ఆ పార్టీ అభిమానులు చెప్పుకొనేవారు. టీడీపీకి ఎదురే లేదనే పరిస్థితి అప్పట్లో ఆ పార్టీ వర్గాలు భావించాయి.
కానీ, 2004 ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డీఎస్ కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో పాటు, బస్సు యాత్ర కూడా అప్పట్లో కాంగ్రెస్ నిర్వహించింది. దీంతో పాటు లెఫ్ట్, బీఆర్ఎస్ లతో పొత్తు వ్యవహరంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో డీఎస్ మంత్రిగా పనిచేశారు.దీంతో ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. 2009 ఎన్నికల ముందు ఆయనకు కాంగ్రెస్ నాయకత్వం మరోసారి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. 2009లో లెఫ్ట్, బీఆర్ఎస్ లతో పొత్తు లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏపీ నుండి వచ్చిన ఎంపీ స్థానాలతోనే కేంద్రంలో యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పాటైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎస్ లు సమన్వయంతో పనిచేసి పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు.
డీఎస్ ను తక్కువగా అంచనా వేసిన చంద్రబాబు
ధర్మపురి శ్రీనివాస్ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమించిన సమయంలో ఏపీలో హ్యాట్రిక్ విజయం తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు అతి విశ్వాసంతో ఉన్నారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో టాక్. 1999లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో టీడీపీ గెలిచింది. దీంతో డీఎస్ ను టీడీపీ నాయకత్వం పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అయితే ఇదే డీఎస్ కు కలిసి వచ్చింది.
అప్పట్లో కొత్తగా వచ్చిన మొబైల్ ఫోన్ తో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి కార్యకర్తతో ఆయన సమన్వయం చేశారు. అంతేకాదు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, విద్యుత్ చార్జీల పెంపు, వరుస అనావృష్టి పరిస్థితులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన రైతులకు ఉచిత విద్యుత్ హామీ కాంగ్రెస్ గెలుపునకు కారణమయ్యాయి. 2004లో డీఎస్, వైఎస్ సెంటిమెంట్ ను 2009లో కూడా కాంగ్రెస్ కొనసాగించింది. 2009లో బీఆర్ఎస్ సహా ఏ పార్టీతో పొత్తు లేకున్నా ఆ పార్టీ గెలిచింది.
కాంగ్రెస్ వీడడానికి డీఎస్ కు దారి తీసిన పరిస్థితులు
డి.శ్రీనివాస్ ఎక్కువ కాలం కాంగ్రెస్ లో పనిచేశారు. 2014 తెలంగాణ ఏర్పాటులో పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడంలో ఆయన పాత్రను ఆపార్టీ నాయకులు గుర్తు చేసుకుంటారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ ఇవ్వలేదు. ఈ స్థానాన్ని ఆకుల లలితకు పార్టీ కేటాయించింది. దీంతో ఆయన మనస్తాపానికి గురై కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయన మారారు. అప్పట్లో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కేసీఆర్ ఇచ్చారు. అయితే 2018 ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై నిజామాబాద్ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై కేసీఆర్ ను కలిసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. బీజేపీ అగ్రనాయకులతో కూడా ఆయన టచ్ లోకి వెళ్లారు. ఆ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా సాగింది. కానీ, 2023 మార్చి 26న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నిజామాబాద్ లో కవిత ఓటమికి చక్రం తిప్పిన డీఎస్
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి 2014లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా కవిత గెలిచారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానంలో మరోసారి పోటీ చేసి డీఎస్ కొడుకు ధర్మపురి అరవింద్ చేతిలో ఆమె ఓడారు. తొలిసారిగా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అరవింద్ గెలుపులో డీఎస్ కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ మూడో స్థానంలో నిలిచారు. తనకున్న పరిచయాలతో నిజామాబాద్ లో కవిత ఓటమి వెనుక డీఎస్ చక్రం తిప్పారని ఆయన అభిమానులు చెబుతారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇదే స్థానం నుండి అరవింద్ రెండోసారి గెలిచారు.
అపాయింట్ మెంట్ లేకుండానే సోనియా ఇంటికి వెళ్లే డీఎస్
కాంగ్రెస్ లో చాలా కాలం పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ కు కాంగ్రెస్ జాతీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. దిల్లీలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇంటికి అపాయింట్ మెంట్ లేకుండానే వెళ్లే అతి కొద్ది మంది నాయకుల్లో డీఎస్ ఒకరు.
డీఎస్ చెప్పినట్టే తెలంగాణ రోడ్ మ్యాప్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2004లో సోనియా వాగ్దానం చేశారు. 2009 తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలు ఊపందుకున్నాయి. తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ నష్టపోతుంది. అయినా కూడా తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వచ్చింది. ఈ విషయంలో పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడంలో డీఎస్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశ పెడతారు... రాష్ట్ర విభజన ఎప్పుడు జరుగుతుందనే విషయాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ నాయకులకు ఆయన సమాచారం ఇచ్చేవారు. తెలంగాణ రోడ్ మ్యాప్ లో డీఎస్ చెప్పినట్టే జరిగిందని అప్పట్లో ఆ పార్టీ నాయకులు చెప్పేవారు.
ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో ఉన్నారు. చిన్న కొడుకు అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. తండ్రి మరణించడంతో నాలోనే ఉన్నావని ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.