Chandrayaan 3: ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం

Chandrayaan 3: చంద్రయాన్-3కి సంబంధించి ముగిసిన కీల‌క ప‌నుల‌ు

Update: 2023-07-05 12:40 GMT

Chandrayaan 3: ఈ నెల 13న చంద్రయాన్-3 ప్రయోగం

Chandrayaan 3: చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13న ఇస్రో ప్రయోగించ‌నుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన ప‌నులు వేగ‌వంతం అయ్యాయి. చంద్రయాన్ పేలోడ్‌ ఉన్న క్యాప్సూల్‌ను.. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ సెంట‌ర్ నుంచి ఆ రాకెట్‌ను ప్రయోగించ‌నున్నారు. స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్ వ‌ద్ద ఎల్వీఎం-3తో చంద్రయాన్ క్యాప్సూల్‌ను జ‌త చేసిన‌ట్లు ఇస్రో తెలిపింది. దీంతో దాదాపు చంద్రయాన్-3 కీల‌క ప‌నుల‌న్నీ ముగిశాయి. హెవీ రాకెట్‌తో పేలోడ్‌ను జ‌త చేయ‌డ‌మే కీల‌క‌మైన ప‌ని.

చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3వేల 900 కేజీల బ‌రువు ఉంటుంది. తొలుత యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్‌లో పేలోడ్‌ను క్యాప్సూల్ చేశారు. ఆ త‌ర్వాత దాన్ని ప్రత్యేక వాహ‌నంలో స‌తీశ్ ధావ‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అక్కడ రాకెట్‌తో పేలోడ్‌ను అనుసంధానం చేశారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 13న‌.. లేదంటే 19వ తేదీలోగా చంద్రయాన్‌3ని ప్రయోగించ‌నున్నట్లు ఇస్రో చైర్మెన్ సోమనాథ్ తెలిపారు.

రాకెట్ పైభాగంలో ఉన్న పేలోడ్‌లో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రొప‌ల్సన్ మాడ్యూల్ వ‌ల్ల చంద్రుడికి సుమారు 100 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తుంది. నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ‌ర్ సుర‌క్షితంగా దిగుతుంద‌ని, ఆ త‌ర్వాత రోవ‌ర్ అక్కడ ర‌సాయ‌న‌క విశ్లేష‌ణ చేప‌డుతుంద‌ని ఇస్రో అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్‌ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం ఇంకా కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది.

ఇక, అంతకుముందు.. 2008లో చంద్రయాన్‌-1 ను చేపట్టింది. అది విజయవతంగా జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. అయితే, అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ.. దాదాపు ఏడాదిలోనే సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలు అందించిన తర్వాత.. ఆ మిషన్‌ ముగిసినట్లు ఆగస్టు 2009లో ఇస్రో ప్రకటించింది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌ 3 ఈ మిషన్‌ విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్లే.

Tags:    

Similar News