ధర్మపురి అర్వింద్‌ను గెటౌట్ అన్నది ఎవరు..ఎన్నికలకు ముందు జరిగిన ఘటన నేడెందుకు చక్కర్లు కొడుతోంది?
తెలంగాణ బిజేపిలో ఇప్పుడొక విషయం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో అంతర్గతంగా సంచలనం కలిగించిన అంశం, ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందూరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరి నోళ్లలోనూ నానుతోంది. ఇంతకీ ఆ సంచలనం ఏంటంటే ప్రస్తుత నిజామబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు రాష్ట్ర బీజేపీలోనే తీవ్రంగా అవమానం జరిగిందట. పార్టీ కీలక మీటింగ్‌లో, ఆ అవమానం ఎదురైందట. ఇంతకీ నిజామాబాద్‌లో సంచలన విజయం సాధించిన అర్వింద్‌కు, జరిగిన అవమానమేంటి ఎవరు అవమానించారు?
ధర్మపురి అరవింద్. పార్లమెంట్ ఎన్నికల ముందు, నిజామాబాద్‌కే పరిమితైన పేరు. ఇప్పుడు దేశమంతా, ధర్మపురి అరవింద్ ఎవరు అన్న చర్చ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించింది ఎవరూ అంటూ వాకటు చేస్తున్నారట. పార్లమెంట్ హాల్లోనూ అరవింద్ ఎవరు, కవితపై విజయం సాధించిన నేత ఎవరూ, అంటూ మిగతా రాష్ట్రాల ఎంపీల ఆరా తీశారట. అరవింద్ పేరు ఇంతగా మారుమోగడానికి కారణం, తెలంగాణలో తిరుగులేని, ఎదురులేని కేసీఆర్‌కే షాకిచ్చేలా, ఆయన కూతురు కవితపై అర్వింద్ విజయం సాధించడం. పార్లమెంట్ పోరులో ప్రతిష్టాత్మక నిజామాబాద్ విజయంతో, పార్టీకే ఊపు తెచ్చాడని భావిస్తున్న అరవింద్‌కు, సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందే, పార్టీలోనే తీవ్ర అవమానం జరిగిందన్న మాట, ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ అర్వింద్‌కు జరిగిన అవమానమేంటి?
ఎవరి సమక్షంలో ఎవరు అవమానించారు?
సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు. హైదరాబాద్‌లో రాష్ట్ర పార్టీ నాయకత్వం కీలక మీటింగ్. పార్టీకి రాష్ట్రంలో అత్యంత కీలకమైన నాయకుడు. నిజామాబాద్‌లో అనవసర రాజకీయాలు చేస్తున్నావంటూ, అర్వింద్‌ను గెట్ అవుట్ అన్నాడట. అదీ ధర్మపురి అర్వింద్‌కు ఎదురైన అవమానం. ఆ మాటతో ఒక్కసారిగా తీవ్ర ఆవేదన చెందానని, తన సన్నిహితుల దగ్గర ఆవేదన పంచుకున్నారట అర్వింద్. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఖంగుతినిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాన్న అర్వింద్‌కు, పార్టీ పరంగా మద్దతివ్వాల్సింది పోయి, అవమానించేలా పార్టీ చేసిందనే చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా నడుస్తోంది. ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన, ఆ నోట ఈ నోట నాని, ప్రస్తుతం ఢిల్లీ చేరిన్నట్లు తెలుస్తోంది.
ధర్మపురి అర్వింద్ బిజేపిలో చేరిననాటికి, పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా బిజేపి పైన, ప్రధాని నరేంద్రమోడిపైన, అభిమానంతో బిజేపిలో చేరారట అర్వింద్. కమలం పార్టీలో చేరిన తరువాత, తన తండ్రి డీఎస్‌కు టిఆర్ఎస్‌లో, తనకు బీజేపీలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చెబుతారు అర్వింద్. అయినా దేశభక్తి కలిగి ఉన్న నేతగా, బిజేపిలో అన్ని అవమానాలు భరిస్తూ, పార్లమెంట్ స్థానంలో గెలవాలన్న ఏకైక లక్ష్యంతో పని చేశానంటారు. దీనికి తోడు పార్టీలో సీనియర్ నేతలు అర్వింద్‌కు అండగా ఉండాల్సింది పోయి, ప్రత్యర్ధి పార్టీకి మద్దతిచ్చేలా వ్యవహరించడం కూడా ఆయన మద్దతు దారులకు ఆవేదనకు గురిచేసిన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు జరిగిన ఘటన అయినప్పటికీ, ఢిల్లీలో ఎవరో ఒకరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారట.
ధర్మపురి అర్వింద్ రాష్ట్ర బీజేపీలో టార్గెట్ అయ్యారా?
అర్వింద్ పట్ల కొందరిలో అసహనం పెరిగిందా?
జాతీయ నేతలతో నేరుగా టచ్‌లో ఉండటమే కారణమా?
ఈ ప్రశ్నలకు ధర్మపురి అర్వింద్ అనుచరులు అవుననే సమాధానం ఇస్తున్నారు. దానికి కారణాలు కూడా వారు విశ్లేషిస్తున్నారు. ధర్మపురి అర్వింద్ రాష్ట్ర పార్టీలో సంబంధం లేకుండా, నేరుగా జాతీయపార్టీ నేతలతో మాట్లాడే సాన్నిహిత్యం ఉండడం వల్లే, పార్టీలో ముఖ్యనేతలకు కంటగింపుగా మారిందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఆయనను వీలైనంతగా అడ్డుకోవాలని చూశారని, అర్వింద్ అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబానికే, గట్టి షాక్కిచ్చిన నేతను ప్రోత్సహించాల్సిందిపోయి, అవమానించేలా వ్యవహరించడం, ఆయన సన్నిహితులకు రుచిచండం లేదట. ధర్మపురి మాత్రం ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రధాని మోడి, పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటానని, సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది.