తెలంగాణ స్టేట్‌ బీజేపీ పీఠం ఎవరికి దక్కబోతోంది.. తెరపైకి వస్తున్న పేర్లేవి?

Update: 2019-12-07 10:21 GMT

కౌన్‌ బనేగా కాషాయ పార్టీకా ప్రెసిడెంట్...? తెలంగాణలో దూకుడు మీదున్నానని భావిస్తున్న బీజేపీ అధిష్టానం, స్టేట్‌ నాయకత్వాన్ని రీఫ్రెష్‌ చెయ్యాలనుకుంటోందన్న వార్తలు వినిపించాయి. కొత్తరక్తం ఎక్కించాలని తపిస్తోందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో తెలంగాణ స్టేట్‌ బీజేపీ పీఠంపై కూర్చోవడానికి, ఎవరికివారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. నాగ్‌పూర్‌ నుంచి హస్తిన వరకు, తమకున్న అన్ని పరిచయాలు కదిలిస్తున్నారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కోసం అభిప్రాయ సేకరణ జరిపిన బీజేపీ అధిష్టానం మదిలో ఎవరున్నారు ఎవరెవరు ప్రెసిడెంట్‌ పీఠంపై కర్చీఫ్‌ వేస్తున్నారు?

నాలుగు ఎంపీ సీట్లు సాధించడంతో, తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ అధినాయకత్వం. దీంతో రాష్ట్ర బీజేపీని పరుగులు పెట్టే అధ్యక్షుని కోసం కసరత్తు చేస్తోంది. అధ్యక్షుడి కోసం ఇప్పటికే అభిప్రాయ సేక‌ర‌ణ జోరుగా సాగుతోంది. అధ్యక్ష పీఠం ద‌క్కించుకునేందుకు ఎవరి ప్రయ‌త్నాలు వారు ముమ్మరం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు ల‌క్ష్మణ్ తో పాటు మరికొంత మంది నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ‌ను పూర్తిచేసేందుకు అధిష్టానం క‌ర‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్‌ నేతల ఢిల్లీ పయనం ఆసక్తి కలిగిస్తోంది.

మరోసారి తనను అధ్యక్షుడిగా కొనసాగించాలని లక్ష్మణ్ బలంగా కోరుకుంటున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈమధ్య ఢిల్లీ కూడా వెళ్లారు. పార్టీ పెద్దలను కలిశారు. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి చేసిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి చేపట్టిన చర్యలు తదితర వివరాలను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు ఒక వర్గం నేతలు చెప్పారు.

ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్మణ్ పని తీరుపై సంతృప్తిగా ఉన్నారని, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, లక్ష్మణ్‌కు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఇవన్నీ ఆయనకు కలిసొస్తాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే, ఈ సమయంలో మళ్లీ ఒకసారి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తే మంచిదని భావించిన లక్ష్మణ్, ఢిల్లీలో పర్యటించారన్న టాక్ వినిపిస్తోంది.

లక్ష్మణ్ మాత్రం తాను రాష్ట్రానికి రావాల్సిన నిధులు,ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడానికే వెళ్లినట్లు చెప్పారు. అయితే పార్టీలోని ఓ వర్గం మాత్రం తన అధ్యక్ష పదవిని రెన్యూవల్ చేసేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికే ఢిల్లీ వెళ్లి ఉంటారని చెప్పుకుంటున్నారు. ఇలా లక్ష్మణ్‌, ఢిల్లీలో తన ప్రయత్నాలు చేస్తుంటే, మరికొందరు నేతలు కూడా, అధ్యక్ష రేసులో తాము సైతం ఉన్నామంటూ రకరకాల మార్గాల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు.

మరోవైపు స్టేట్ బీజేపీ పీఠం కోసం ఇతర నేతలు కూడా గట్టిగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి, జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేరును కూడా, చాలామంది అధ్యక్ష పదవికి సూచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, పార్టీ మరింత దూకుడుగా ముందుకెళుతుందని, అధిష్టానానికి కొందరు సీనియర్లు చెబుతున్నారట.

ఇక కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచి, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా పాపులర్ అవుతున్న బండి సంజయ్ సైతం, అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు సీనియర్ల ద్వారా, ఆయన పావులు కదుపుతున్నట్ట కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు మాజీ మంత్రి డీకే అరుణ పేరు కూడా బీజేపీ ప్రెసిడెంట్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మహిళా నేత కావడం, కేసీఆర్‌పై ముందు నుంచి దూకుడుగా మాట్లాడే నాయకురాలు కావడంతో సహజంగానే ఆమె పేరు తెరపైకి వస్తోంది. డీకే అరుణకు పగ్గాలు అప్పగిస్తే, ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం బీజేపీకి క్యూ కడతారని, క్షేత్రస్థాయిలో కొత్త క్యాడర్‌ పార్టీకి జత కలుస్తుందని కొందరు అరుణ పేరును సూచిస్తున్నారట. బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ ఆశీస్సులు కూడా అరుణకు వున్నాయని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా, ప్రెసిడెంట్ పదవి కోసం హస్తినస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

ఇలా ఎవరికి వారు బీజేపీ అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతున్నారు. అయితే, అధ్యక్షుని ఎంపికపై పార్టీ మొత్తం గ్రూపులుగా విడిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి, అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కొందరు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి, దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నవారికి అవకాశం ఇవ్వాలని సీనియర్లు అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అయితే, కొత్తవారైనా, పాతవారైనా సమర్థులుండాలని, పార్టీ ఎదుగుతున్న క్రమంలో, కొత్త నీరు అవసరమని కూడా, మరికొందరు అమిత్‌ షాకు చెబుతున్నారట. ఇలా పాతకొత్త గొడవలు, చాలాపేర్లు తెరపైకి వస్తుండటంతో, ఎవరిని ఎంపిక చేస్తే, ఏమవుతుందోనని, కాషాయ అధిష్టానం తలలు పట్టుకుంటోందట. చూడాలి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష సింహాసనంపై ఎవరు కూర్చుంటారో, ఆ తర్వాత పార్టీలో పరిణామాలు ఏం జరుగుతాయో.

Tags:    

Similar News