కమలనాథులు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, అధినాయకత్వం దృష్టిని తెలంగాణపై మరలించాయి. నిజానికి ఎప్పటి నుంచో తెలంగాణలో పట్టుసాధించాలని ఉవ్విళ్లూరుతున్న ఆ పార్టీకి ప్రస్తుతం కాంగ్రెస్ బలహీనపడటం చాలా వరకు కలిసొచ్చింది. పాగా వేయాలంటే ఇదే సరైన సమయం అని భావిస్తున్న ఆ పార్టీ అధినాయకత్వం అధికారమే లక్ష్యంగా పట్టు కోసం వ్యూహరచన చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవటం, ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందటం అటు బిజేపీలో నూతనోత్సహాన్ని నింపింది. అటు కేంద్రంలోనూ బిజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవటం ఆ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చింది. ఇక టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని భావిస్తున్న నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవటానికి పోటీపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇతర పార్టీల నాయకులను తమ గూట్లోకి చేర్చుకొని బలోపేతం అవడానికి ప్రణాళికలు రచిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలిపించుకుని వారితో పలుమార్లు సమావేశమైన అమిత్ షా పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా అప్పట్లో ఓసారి హైదరాబాద్ వచ్చారు. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స‌్ఫూర్తితో దూసుకుపోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఉదహరించిన షా టీఆర్‌ఎస్ వైఫల్యాలపై గళమెత్తటానికి సిద్దపడాలని సూచించించినట్టు చెబుతున్నారు కమలనాథులు.
ఇక ఇప్పటికే తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది కమలం అధిష్టానం. అందులో ప్రధానంగా ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను తమవైపు లాగటం ప్రధానమైనదిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ద్వితీయ శ్రేణి నాయకులు, అంతగా ప్రాచుర్యంలో లేని నాయకులే బీజేపీలో చేరారు. అయితే అసలు సినిమా ముందుందని రాష‌్ట్ర నాయకులు కామెంట్ చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదలొద్దన్న అధిష్ఠానం సూచన మేరకు తెలంగాణలో కమలనాథులు తెరచాటు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
వచ్చే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆ పార్టీ నాయకులు పదే పదే చేస్తున్న ప్రకటనలు వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయ్. ఆపరేషన్ ఆకర్ష్ విషయంలోనూ ఆ పార్టీ పకడ్బందీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నందున, కమలనాథులు అధికార పార్టీలో నిన్నామొన్నటి వరకు మంచి ప్రాధాన్యముండి ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయిన నాయకులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.