Telangana Group 1: డేంజర్‌లో రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Update: 2024-10-18 16:18 GMT

Telangana Group 1: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొందరు నేతలు సీఎం సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనతో ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. హైడ్రా నడవాలే.. మూసీ ప్రక్షాళన గొడవ కావాలే.. గ్రూప్ 1 గొడవ పెద్దది కావాలని కాంగ్రెస్ నేతలే కోరుకుంటున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

శుక్రవారం కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ నిరుద్యోగుల వద్దకు సామాన్య కార్యకర్తగా వెళ్లి అండగా ఉంటానని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం 29 జీవోను ఉపసంహరించుకుని, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.

గ్రూప్ -1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జీని ఆయన ఖండించారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తరా అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టడానికే 29 జీవో జారీ చేశారన్నారు. ఈ జీవోను సవరించి న్యాయం చేయమని అడిగితే కొట్టిస్తారా?. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తే తప్పేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ సర్కార్‌కు, కాంగ్రెస్ పాలనకు తేడా లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. మూసీపై కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఓ జోక్ అని అన్నారు. మూసీపై కేసీఆర్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారన్నారు. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డే అని ఆయన గుర్తుచేశారు.

Tags:    

Similar News