ఆయన రాష్ట్రమంత్రి నియోజకవర్గాల్లో పర్యటిస్తే చాలు, ఆ ప్రాంతాల రూపురేఖలు మారుతాయన్న నమ్మకం ప్రజలది. కాని ఆయన తన సొంత నియోజకవర్గం తప్ప, మిగతా నియోజకవర్గాల మొహం కూడా చూడటం లేదట. జిల్లాలో ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన మంత్రి, సొంత నియోజకవర్గానికే ఎందుకు పరిమితమయ్యారు ఎమ్యెల్యేలతో విభేదాలే కారణమా ఎమ్మెల్యేలు, మంత్రికి మధ్య రోజురోజుకు అగాథం పెరుగుతోందా మంత్రి, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్‌ను, గులాబీ అధిష్టానం సీరియస్ తీసుకుంటోందా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి క్యాబినెట్‌లో స్థానం లభించిన ఏకైక ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు నడిపించాల్సిన మంత్రి, సొంత నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారన్న ప్రచారం ప్రచారం, జిల్లా టీఆర్ఎస్‌లో కాక రేపుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు నడిపించాల్సిన మంత్రి, నిర్మల్ నియోజకవర్గానికి మాత్రమే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. అభివృద్ది పనులైనా, పర్యవేక్షణలైనా సొంత నియోజకవర్గం వదిలి వీడి బయటకు వెళ్లడం లేదని సొంత పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట. ఇదే చర్చ పార్టీలో జోరుగా సాగుతుందట. అభివృద్ది కార్యక్రమాలకు మంత్రిని ఆహ్వానించినా రావడంలేదట. అందుకే కొందరు ఎమ్మెల్యేలు పిలువడానికే జంకుతున్నారట.
రాష్ట్రమంత్రిగా పది నియోజకవర్గాల్లో అభివృద్ది, సంక్షేమ పథకాలు ముందుండి నడిపించాల్సిన నాయకుడు, పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాడని సొంతపార్టీలో తీవ్రమైన చర్చ సాగుతోందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా నాలుగు జడ్పీ సమావేశాలకు హాజరు కావడం తప్ప, కనీసం నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు పట్టించుకోవడం లేదట. దాంతో జిల్లాలో మంత్రి ఇంద్రరణ్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం సాగుతోందట.
జిల్లా మంత్రిగా అందర్నీ కలుపుకుపోవాల్సిన మంత్రి, అసలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అటవీ మంత్రిగా ఉండి, మంత్రి విఫలం కావడం వల్లే సర్సాల సమస్య ఉత్పన్నమైందన్న వాదన జరుగుతోంది. అయినప్పటికీ మంత్రి తీరు మారలేదట. దీనిపై అక్కడి స్థానిక ఎమ్మెల్యే, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. మిగతా నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారంలో ఇలానే వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట. నియోజకవర్గాల అభివృద్ది విషయంలో, మంత్రి అంటీముట్టనట్టుగా ఉంటున్నారని, ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట. ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బిజెపి పుంజుకుంటుంటే, అధికార పార్టీలో మంత్రి, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ మరింత గ్యాప్ తెస్తోందని పార్టీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయట.
మంత్రి ఒంటెద్దు పోకడలతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి చేతిలో పార్టీ ఓడిపోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముప్పు తప్పదని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట. పార్టీని ముందుకు నడిపించాల్సిన నాయకుడు, కనీసం ఎమ్మెల్యేల మధ్య సమన్వయం సాధించలేకపోతున్నారట. దాంతో ఎమ్మెల్యేలు మంత్రి తీరుపై రగిలిపోతున్నారట. అభివృద్దిలో పరుగులు పెట్టించాల్సిన మంత్రి, పట్టించుకోకపోవడం లేదని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. జిల్లా మంత్రే ఇలా వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథన పడుతున్నారట. నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పడు సైతం పట్టించుకోవడంలేదట. కేవలం నియోజకవర్గానికే మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీ వర్గాల్లో జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయట. మంత్రి తీరు ఇలాగే ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడటానికి ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారట.
మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో పైకి కనిపించకపోయినా, మంత్రి, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోందని గులాబీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈస్థాయిలో అగాథం పెరిగిందని చర్చించుకుంటున్నారు. కనీసం పార్టీ పెద్దలైనా స్పందించి మంత్రికి, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ తగ్గించాలని కోరుతున్నారట. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ విభేధాలపై, పార్టీ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారో, ఎలా పరిష‌్కరిస్తారోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.