3D Street Art in Khammam: గోడలపై గ్రేట్‌ ఆర్ట్‌.. గోడలపై ఆర్ట్‌లు వేస్తూ ఆలోచింప చేస్తున్న యువజంట

Update: 2020-06-30 10:50 GMT

3D Street Art in Khammam: వారు గీసే గీతలు రాసే రాతలు వేసే బొమ్మలు చూస్తే క్షణం ఆగి ఆలోచించాల్సిందే. ఒక్కోసారి కొన్ని చిత్రాలను చూస్తే అవి మనసుతో మాట్లాడతాయి. మెదడు లోతైన ఆలోచనల్లోంచి పరిగెత్తేలా ఒత్తిళ్లల్లోంచి బయటపడి మానసిక ఆనందాల్లోకి జాలువారేలా చేస్తాయి. చూపులకు నిండుదనాన్ని కలిగించే కొన్ని చిత్రాలను ఓ జంట ఆధునిక నైపుణ్యంతో తీర్చిదిద్దుతోంది.

ఖమ్మం పట్టణానికి చెందిన యువత స్వాతి, విజయ్‌ గోడల మీద ఆర్ట్‌లు వేస్తూ తమ అభిరుచిని చాటుతున్నారు. ఖమ్మం నగరంలోని ద్వారాకా నగర్ ప్రాంతానికి చెందిన స్వాతి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఫైన్‌ఆర్ట్స్‌ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. తన సహ విద్యార్థి విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుని కళలతో పాటు జీవితాన్ని రంగులమయం చేసుకున్నారు. ఈ జంట రోడ్లపై, గోడలపై వేసిన బొమ్మాలు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

ప్రధాన నగరాల్లో ట్రెండ్ గా మారిన స్ట్రీట్ ఆర్ట్ వాల్ పెయింటింగ్‌ను సొంత జిల్లా ఖమ్మంలో కూడా పరిచయం చేసారు. ఈ మధ్య వాళ్లు ఖమ్మంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియం గోడపై బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు 40 అడుగుల పెయింటింగ్‌ను వేశారు. ఈ పెయింటింగ్‌ను కేటీఆర్‌ ప్రసంశించారు. ఇక ఖమ్మం పార్లమెంటు మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత గ్రామం కల్లూరు మండలం నారాయణపురం ప్రభుత్వం పాఠశాలలో స్వాతితో వేసిన చిత్రాలు చిన్నారులను బడి బాట పట్టేలా చేశాయి.

స్ట్రీట్‌ ఆర్ట్‌కి విదేశాల్లో ఉన్న ఆదరణ చూసిన తర్వాత మన దేశంలో కూడా ఈ కళను విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఖాళీగా ఒక గోడ కనిపిస్తే చాలు తెల్లారేసరికి అదొక సందేశంగా మార్చేస్తారు. మన బాధ్యతను గుర్తుచేసేవిధంగా స్ఫూర్తిదాయకమైన చిత్రాలు గీస్తున్నారు. మొత్తంగా మంచి ఆలోచనలకు గోడ కడుతున్న స్వాతి దంపతులు సమాజాన్ని కదిలించే సందేశాన్ని కళాత్మకంగా చెబుతున్నారు. 


Full View


Tags:    

Similar News