సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లని భూమ్మీదకు తీసుకొచ్చే రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకొచ్చింది?

Update: 2024-10-05 13:50 GMT

Sunita Williams and Butch Wilmore Rescue Mission: 8 రోజుల ప్రయాణం అనుకున్న అంతరిక్ష ప్రయోగం కాస్తా 8 నెలలకు పెరిగింది. ఈ ఏడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి అనుకోకుండా అక్కడే చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అందులో భాగంగానే నాసా పంపించిన స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన డ్రాగాన్ క్యాప్సుల్ అనే వ్యోమనౌక గత ఆదివారమే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి చేరుకుంది.

అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7:04 గంటలకు డ్రాగాన్ క్యాప్సుల్ అక్కడికి చేరుకుంది. అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారిజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ వ్యోమనౌక ఐస్ఎస్ వద్దకు వెళ్లింది.

ఈ డ్రాగాన్ క్యాప్సూల్‌లో మొత్తం ఏడుగురు వ్యోమగాములు ప్రయాణం చేయొచ్చు. తొలుత ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం నలుగురు వ్యోమగాముల పేర్లను ఎంపిక చేశారు. కానీ తిరుగు ప్రయాణంలో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా తోడు అవుతారనే ఉద్దేశంతో అందులోంచి ఇద్దరిని పక్కన పెట్టి మరో ఇద్దరినే పంపించారు. అలా నాసాకి చెందిన ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెగ్జాండర్ గొర్బునొవ్ ఇద్దరే ఆ వ్యోమనౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి చేరుకున్నారు. డ్రాగాన్ క్యాప్సుల్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి చేరుకున్న ఇద్దరు వ్యోమగాములకు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లతో పాటు అప్పటికే అక్కడున్న వ్యోమగాముల నుండి ఘన స్వాగతం లభించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తీసుకుని ఈ వ్యోమనౌక భూమ్మీదకు చేరుకోనుంది. అప్పటివరకు వాళ్లు అక్కడే ఉంటూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని మిగతా వ్యోమగాములతో కలిసి పరిశోధనల్లో పాల్గొననున్నారు. అలా 8 రోజుల ప్రయాణం కాస్తా ఊహించనిరీతిలో 8 నెలల ప్రయాణంగా మారిపోయింది.

Tags:    

Similar News