Sim Cards: ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా.?
ఉచితంగా లభిస్తుండడంతో చాలా మంది సిమ్ కార్డులను వాడేసి వాటిని బ్లాక్ చేయకుండానే పక్కన పడేస్తుంటారు.
ప్రస్తుతం చేతిలో ఫోన్ లేని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టెలికం కంపెనీలు పెరగడం రకరకాల ఆఫర్లను అందిస్తుండడంతో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ సిమ్‌కార్డులను తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో ఫోన్‌లు రావడంతో చాలా మంది ఒకటికి మించి ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను కలిగి ఉండవచ్చు. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం..
ఉచితంగా లభిస్తుండడంతో చాలా మంది సిమ్ కార్డులను వాడేసి వాటిని బ్లాక్ చేయకుండానే పక్కన పడేస్తుంటారు. అలాగే ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తూ కొందరు మనకు తెలియకుండానే మన ఆధార్‌తో సిమ్ కార్డులు తీసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్‌కార్డులు తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నేరాలు జరిగే అవకాశాలను తగ్గించేందుకు, బల్క్‌లో సిమ్ కార్డలు తీసుకోవడాన్ని నిషేధించారు.
ఇంతకీ మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎప్పుడైనా సందేహం వచ్చిందా.? అయితే దీనికోసం కూడా ఒక మార్గం ఉంది. మీ ఐడి కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి డాట్.. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో మీ ఆధార్ కార్డ్‌పై ఎన్ని సిమ్ కార్డులు జారీ చేశారో తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌ను ఎవరైనా దొంగలించినట్లయితే.. దాన్ని బ్లాక్ చేసుకునేలా అవకాశం ఉంది.
ఇందుకోసం ముందుగా sancharsaathi వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం 'Citizen Centric Services' కింద కనిపించే ఆప్షన్‌లో 'Know your mobile connections'క్లిక్ చేయాలి. అనంతరం మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా ప్రత్యక్షమవుతుంది. అందులో ఉన్న ఫోన్ నంబర్లు మీవేనా? కాదా? చెక్ చేసుకోండి. ఒకవేళ మీవి కాకపోతే వెంటనే అక్కడే బ్లాక్ చేసుకునే అవకాశం కల్పించారు.