YouTube: యూట్యూబ్‌లో మీరేం చూస్తున్నారో.. ఇతరులకు తెలియకూడదా, ఇలా చేయండి..
YouTube: ప్రస్తుతం యూట్యూబ్ వినియోగం భారీగా పెరిగింది. న్యూస్ మొదలు ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని యూట్యూబ్‌లో క్షణాల్లో ప్రత్యక్షమవుతుంటాయి.
YouTube: ప్రస్తుతం యూట్యూబ్ వినియోగం భారీగా పెరిగింది. న్యూస్ మొదలు ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని యూట్యూబ్‌లో క్షణాల్లో ప్రత్యక్షమవుతుంటాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఎంతో ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో మనం ఏం చూస్తున్నామన్న విషయం ఎప్పటికప్పుడు హిస్టరీ రూపంలో సేవ్ అవుతూనే ఉంటుంది.
అలా కాకుండా మీరు యూట్యూబ్‌లో ఏం చేస్తున్నారు.? ఎలాంటి వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నారన్న విషయం ఇతరులకు తెలియకుండా ఉండేందుకు కూడా ఓ ట్రిక్ అందుబాటులో ఉందని మీకు తెలుసా.? ఇంతకీ యూట్యూబ్‌లో ఉన్న ఈ ఫీచర్ ఏంటి.? ఇది ఎలా ఉపయోగపడుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్స్‌లో సెర్చ్ చేసే సమయంలో ఇన్‌కాగ్నిటో మోడ్ అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే.
ఈ మోడ్‌లోకి వెళ్లి మనకు కావాల్సిన సమాచారం కోసం ఎంటర్ చేస్తే హిస్టరీలో సేవ్ అవ్వదు. అచ్చంగా యూట్యూబ్‌లోనూ ఇలాంటి ఓ ఫీచర్ అందుబాటులో ఉంది. ‘యూట్యూబ్ ఇన్‌కాగ్నిటో మోడ్’ పేరుతో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ సహాయంతో యూట్యూబ్‌లో మీరు ఏం చేస్తున్నారో ఇతరులకు తెలియదు. ఎలాంటి ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఇంతకీ ఈ మోడ్‌ను ఎలా సెలక్ట్ చేసుకోవాలనేగా మీ సందేహం. ఇందుకోసం ముందుగా ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ అకౌంట్ సింబల్‌పై క్లిక్ చేయాలి. వెంటనే అక్కడ కనిపించే.. ‘Turn on Incognito’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే మీ స్క్రీన్ డార్క్ మోడ్‌లోకి వెళ్తుంది. దీంతో ఈ మోడ్‌లో మీరు చూసే వీడియోలకు సంబంధించిన వివరాలు సేవ్ అవ్వవు. అయితే ఈ మోడ్‌లో కూడా అన్ని రకాల వీడియోలను చూడడం వీలు పడదు. వయసు రిస్ట్రిక్షన్ ఉన్న వీడియోలను చూడాలంటే కచ్చితంగా మీ మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.