Airtel Outage Updates: ఎయిర్‌టెల్ సేవలు డౌన్... జుట్టు పీక్కున్న కస్టమర్స్
Airtel outage affected mobile data and broadband services: గురువారం ఎయిర్‌టెల్ సేవలు డౌన్ అయ్యాయి. రియల్ టైమ్ ప్రాబ్లం ట్రాకింగ్, ఔటేజ్ మానిటర్ సేవలు అందించే డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇవాళ ఉదయం 9:52 గంటల నుండి ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 2 గంటలపాటు ఈ సమస్య కొనసాగిందని డౌన్‌డిటెక్టర్ గ్రాఫ్ చెబుతోంది. మధ్యాహ్నం తరువాత కూడా సమస్యలు తలెత్తినట్లు ఆ గ్రాఫ్ సూచిస్తోంది.
సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ డౌన్ అవండంతో కస్టమర్స్ ఫోన్ కాల్స్ చేసుకోవడంలో, కాల్స్ రిసీవ్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం ఫోన్ కాల్స్ విషయంలోనే కాదు... మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్ సేవలకు (Airtel Mobile data) కూడా అంతరాయం ఏర్పడింది.
ఈ ఊహించని పరిణామంతో తమకు జుట్టు పీక్కున్నంత పనైందని ఎయిర్‌టెల్ వినియోగదారులు వాపోతున్నారు. ఇదే విషయమై ఎక్స్ వేదికగా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎయిర్‌టెల్ కస్టమర్స్ (Airtel customers) తమ అనుభవాలను పంచుకుంటూ పోస్టులు పెట్టారు.
టెలికాం నెట్‌వర్క్స్ డౌన్ అవడం అనేది అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్యే. సాధారణంగా కొన్నిసార్లు ఏదైనా టెలికాం నెట్‌వర్క్ డౌన్ అయినప్పుడు కొన్ని పరిమిత టెలికాం సర్కిల్స్‌లోనే ఆ సమస్య ఎదురవుతుంటుంది. అలాంటప్పుడు ఆ సమస్య ప్రభావం కూడా కేవలం ప్రాంతాలకే పరిమితం అవుతుంటుంది. కానీ ఈరోజు ఎదురైన ఎయిర్‌టెల్ ఔటేజ్ ప్రాబ్లం (Airtel outage) దేశమంతా కనిపించిందని డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.
టెలికాం నెట్‌వర్క్స్ మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, ఎక్స్, లింక్‌డ్ ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ విషయంలోనూ అప్పుడప్పుడూ ఈ ఔటేజ్ సమస్య ఎదురవుతుంటుంది. ఆయా టెక్నాలజీ కంపెనీలు కూడా ఇలాంటి సందర్భాల్లో అత్యంత వేగంగా స్పందించి ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటాయి. లేదంటే అది వారి బిజినెస్‌పైనే దుష్ప్రభావం చూపిస్తుందనేది వారి భయం. ఎందుకంటే తరచుగా ఇలాంటి సమస్యలు (Server down) ఎదురైతే... ఆయా కంపెనీల సేవలు అందుకునే కస్టమర్స్ ఆ కంపెనీలను విడిచి మరో ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉంటుంది.