India vs Australia: ఫ్లాష్ బ్యాక్ 2003.. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులు

India vs Australia: 20 ఏళ్ల తరువాత మళ్లీ తలపడుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా

Update: 2023-11-18 11:53 GMT

India vs Australia: ఫ్లాష్ బ్యాక్ 2003.. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులు

India vs Australia: క్రికెట్లో భారత్‌-ఆస్ట్రేలియాఫైనల్‌ అంటే చాలు.. అభిమానులు 2003 ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోతారు. రోజులు, నెలలు కాదు కొన్నేళ్ల పాటు వెంటాడిన ఆ చేదు జ్ఞాపకాలతో గుండెలు బరువెక్కుతాయి. పేలవ ఆరంభం తర్వాత అద్భుత ప్రదర్శనతో సౌరభ్ సేన ఫైనల్‌ చేరగానే ఇక మనదే ప్రపంచకప్‌ అనుకున్న సమయంలో కంగారూలు కొట్టింది మామూలు దెబ్బ కాదు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు అదే ప్రత్యర్థి ఎదురవుతోంది. కానీ అప్పటికి ఇప్పటికీ కథ చాలా మారింది. మరి కంగారూల బాకీని రోహిత్‌సేన తీర్చేస్తుందా?

2003లో జరిగిన మెగా టోర్నీలో ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో, భారత్ 8 మ్యాచ్‌లలో గెలిచాయి. గంగూలీ, సచిన్‌, ద్రవిడ్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌, హర్భజన్‌, జహీర్‌ ఖాన్‌, శ్రీనాథ్‌, నెహ్రా.. ఇలా మహామహులైన ఆటగాళ్లతో కూడిన టీమ్‌ఇండియా 2003లో మంచి అంచనాలతో ప్రపంచకప్‌ బరిలోకి దిగింది. అయితే టాస్ గెలిచిన గంగూలీ బ్యాటింగ్ కాకుండా ఛేజింగ్ ఎంచుకున్నాడు. దీంతో సీన్ రివర్స్ అయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉతికి ఆరేశారు. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా వరుసగా కుప్పకూలింది. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుని మన జట్టు శవయాత్రలు చేసే వరకు వెళ్లింది.

తొలి మ్యాచ్‌ పరాభవం తర్వాత అద్భుతంగా పుంజుకుని ప్రతి మ్యాచ్‌ గెలుస్తూ ఫైనల్‌ చేరింది దాదాసేన. అదే ఊపులో కప్పు కూడా కొట్టేస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ సగం ఇన్నింగ్స్‌ అయ్యేసరికే ఫలితం తేలిపోయింది. పాంటింగ్‌ 121 బంతుల్లో 140 నాటౌట్‌ సహా కంగారూ బ్యాటర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయిన భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆసీస్‌ స్కోరు రెండు వికెట్లకు 359 పరుగులు చేసింది. 360 లక్ష్యం అనగానే ఓటమి తప్పదని తేలిపోయింది. సచిన్‌ నాలుగు పరుగులతో ఆరంభంలోనే వెనుతిరిగాడు. దీంతో మ్యాచ్‌ మీద ఆశలు పోయాయి. సెహ్వాగ్‌ 82 పరుగులు చేసినా లాభం లేకుండాపోయింది.

125 పరుగుల తేడాతో పరాజయం పాలై కప్పును దూరం చేసుకుంది టీమ్‌ఇండియా. అయితే ఆ టోర్నీలో గంగూలీ సేన ఎంత బాగా ఆడినా.. అప్పటికి ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం మామూలుగా లేదు. గిల్‌క్రిస్ట్‌, హేడెన్‌, పాంటింగ్‌, మార్టిన్‌, బెవాన్‌, సైమండ్స్‌లతో బ్యాటింగ్‌, మెక్‌గ్రాత్‌, బ్రెట్‌లీ, బికెల్‌, హాగ్‌లతో బౌలింగ్‌ దుర్బేధ్యంగా ఉండేది. ప్రపంచకప్‌లో ఆ జట్టు పక్కా ప్రణాళికతో ఆడేది. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఎదురుదాడే మంత్రంగా సాగే ఆస్ట్రేలియా ఆటను తట్టుకోవడం బలమైన ప్రత్యర్థులకు కూడా సాధ్యమయ్యేది కాదు. ఆరంభం నుంచే భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టి కోలుకునే అవకాశమే లేకుండా చేయడంతో దాదాసేనకు పరాభవం తప్పలేదు.

ఆస్ట్రేలియా క్రికెట్లో ప్రొఫెషనలిజానికి లోటు ఉండదు. ఓటమిని ఒప్పుకోకుండా తుదికంటా పోరాడే తీరు వారిని భిన్నంగా నిలబెడుతుంది. కాబట్టి ఈసారి కూడా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీని రెండు ఓటములతో మొదలుపెట్టి తర్వాత ప్రతి మ్యాచ్‌ గెలుస్తూ ఫైనల్‌ చేరిన జట్టది. అఫ్గానిస్థాన్‌పై ఘోర పరాభవం తప్పదనుకున్నాక గెలిచిన తీరు అసామాన్యం. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లోనూ ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. ఇవి ఆ జట్టు పోరాటతత్వాన్ని చాటేవే.

కానీ అదే సమయంలో ఆస్ట్రేలియా ఒకప్పట్లా దుర్బేధ్యం కాదనడానికి ఈ మ్యాచ్‌లే ఉదాహరణ.నిజానికి 2003తో పోలిస్తే రెండు జట్లు భిన్నమైన స్థితిలో ఉన్నాయిప్పుడు. అప్పటి ఆస్ట్రేలియా స్థాయిలో ఇప్పుడు భారత్‌ ఆధిపత్యం చలాయిస్తోంది. అజేయంగా సాగిపోతోంది.

అన్ని విభాగాల్లో బలంగా ఉన్న మన జట్టు.. అప్పటి ఆస్ట్రేలియా తరహాలోనే పక్కా ప్రణాళికతో ఆడుతోంది. బ్యాటింగ్‌లో ఎదురుదాడి చేస్తోంది. బౌలింగ్‌లో ఆరంభం నుంచే ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ సాగుతోంది. సొంతగడ్డపై ఆడుతుండటం మన జట్టు బలాన్ని పెంచేదే. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అయినా.. భారత్‌తో పోలిస్తే బలహీనమే. లీగ్‌ దశ తొలి మ్యాచ్‌లోనే భారత్‌.. కంగారూలను ఓడించింది. మన జట్టు ఆత్మవిశ్వాసం ప్రస్తుతం పతాక స్థాయిలో ఉంది. అప్పుడు ఆసీస్‌ను చూసి మనవాళ్లు కంగారు పడ్డట్టు.. ఇప్పుడు మన జట్టును చూసి ప్రత్యర్థే భయపడే పరిస్థితి ఉంది.

కాకపోతే ప్రత్యర్థిని ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. చిన్న అవకాశం వచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్‌ను తమ వైపు లాగేస్తారు కాబట్టి.. ఏ దశలోనూ ఉదాసీనతకు తావివ్వకుండా ఆరంభం నుంచి చివరి వరకు ఒకే రకమైన తీవ్రతను చూపించాలి. ఇప్పటిదాకా సాగిన ఆటతీరునే ఫైనల్లోనూ కొనసాగిస్తే.. ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే 2003 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం కష్టమేమీ కాదు.

Tags:    

Similar News