చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయిన నీరజ్.. రూ.6 కోట్లు నజరానా ప్రకటించిన హర్యానా సర్కార్
Neeraj Chopra: భారత యంగ్ ప్లేయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Neeraj Chopra: భారత యంగ్ ప్లేయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 130 కోట్ల భారతీయులను ఆనందంలో ముంచెత్తాడు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. స్వత్రంత్ర భారత దేశంలో వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత గోల్డ్ మెడల్ అందుకున్న వీరుడిగా నిలిచాడు.
87.03.. 87.58.. ఇవీ గోల్డెన్ చోప్రా బంగారు పతకం వేటలో విసిరిన ఈటెల దూరపు లెక్కలు.! ప్రత్యర్ధి ఎవరన్నది పట్టించుకోలేదు. మహామహులు అనుభవజ్ఞులు పతకాలకు ఫేవరెట్లను లెక్కే చేయలేదు. టార్గెట్ మీదే ఫోకస్ చేశాడు. ఫలితంగా భారత బంగారు కలను నెరవేర్చాడు. ఆట ఆఖరి వరకూ 87.58 మీటర్ల దూరంతో శిఖరాగ్రాన నిలిచి సరికొత్త చరిత్రను సృష్టించాడు.
నిన్నటి వరకూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం కలగానే మిగిలిన వేళ యంగ్ ప్లేయర్ నీరజ్ అద్భుతం సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అద్భత ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రా చివరి వరకూ టాప్‌లో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు విసిరి టాప్‌లో నిలిచిన నీరజ్ రెండో రౌండ్‌లోనూ 87.58 మీటర్లు విసిరి అదే జోరును కొనసాగించాడు నిలిచాడు. ఆట చివరి వరకూ అన్ని రౌండ్లు పూర్తయ్యే సమయానికి నీరజ్ చేసిన 87.58 మీటర్ల దూరానికి ఎవరూ దగ్గరకు రాకపోవడంతో భారత్‌కు గోల్డ్ మెడల్ దక్కింది.
మరోవైపు మొదటి రౌండ్‌లోనే 87.03 మీటర్లు విసిరి టాప్ పొజీషన్‌లో ఉన్న నీరజ్ రెండో రౌండ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మూడో రౌండ్లో 76. 79 మీటర్లు విసిరినప్పటికి తొలి రెండు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో తొలి స్థానంలో కొనసాగాడు. ఇక నాలుగో, ఐదో రౌండ్‌లో త్రో వేయడంలో విఫలమయ్యాడు. ఇక చివరగా ఆరో రౌండ్‌లో 84.24తో ముగించాడు. ఓవరాల్‌గా 87.58తో సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు.
నీరజ్ గోల్డ్ మెడల్‌తో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. 1900 సంవత్సరంలో నోర్మన్ ప్రిచర్డ్ ట్రాక్‌లో రెండు రజత పతకాలు గెలుచుకున్నాడు. అయితే, అది బ్రిటిష్ ఇండియా కాలం నాటి మాట. స్వతంత్ర భారతావనిలో మాత్రం ఇదే తొలిసారి. దిగ్గజ అథ్లెట్ అయిన మిల్కా సింగ్, పీటీ ఉష 1960, 1984లో దగ్గరగా వచ్చినప్పటికీ నాలుగో స్థానంతో నిలిచి నిరాశ పరిచారు. ఇదే సమయంలో భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్రలోకెక్కాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో అభివన్ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు.
సింపుల్ ఫ్యామిలీ భారత ఆర్మీలో ఉద్యోగం ఎవరికైనా ఇంకేం కావాలి.? హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడిపేయొచ్చు. కానీ నీరజ్ మాత్రం ఇంకేదో సాధించాలనుకున్నాడు. చిన్నతనంలోనే జావెలిన్ త్రోపై ఆశక్తి పెంచుకున్నాడు. ఫలితంగా 130 కోట్ల భారతీయుల బంగారు కలను నెరవేర్చి గోల్డెన్ చోప్రాగా నిలిచాడు.
హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉండడం విశేషం.
మరోవైపు అతిసామాన్య కుటుంబంలో జన్మించిన నీరజ్ చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ పెంచుకున్నాడు. జావెలిన్ త్రోలో ప్రముఖ ఆటగాడు జై చౌధరీ దగ్గర చేరాడు. జావెలిన్ త్రోపై నీరజ్‌కు ఉన్న ఆశక్తిని గుర్తించిన జై చౌధరీ ఆటలోని మెళకువలు నేర్పించాడు. దీంతో ఓ వైపు చదువును కొనసాగిస్తూనే నీరజ్ 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
2016 నుంచి నీరజ్ కెరీర్ మలుపు తిరిగింది. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2016లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్ చోప్రా కఠోర శిక్షణ తీసుకున్నాడు. తన ఉత్తమ ప్రదర్శనలతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్న నీరజ్.. ఆస్ట్రేలియా కోచ్ గారీ కాల్వర్ట్ వద్ద శిక్షణ పొందాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి తన కలను నెరవేర్చుకున్నాడు. ఇక టోక్యో సాక్షిగా నీరజ్ గ్రాండ్ విక్టరీపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. గోల్డ్ సాధించడంతో నీరజ్ సొంతా రాష్ట్రం హర్యానా ఆరు కోట్ల నజరానా ప్రకటించగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి సహా నీరజ్‌పై అభినందనల వెల్లువ కురుస్తోంది.