షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు
Maria Sharapova-Michael Schumacher: రష్యా టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా, ఫార్ములా వన్ రేసింగ్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్‌తో సహా మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Maria Sharapova-Michael Schumacher: రష్యా టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా, ఫార్ములా వన్ రేసింగ్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్‌తో సహా మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుగావ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఢిల్లీలోని చత్తార్‌పూర్ మినీ ఫామ్‌కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదుతో గురుగావ్ పోలీసులు చీటింగ్, క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియల్‌టెక్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమని మోసం చేసిందని షఫాలీ అగర్వాల్ కోర్టును ఆశ్రయించారు.
ఆ ప్రాజెక్ట్‌లో షరపోవా, షుమాకర్ భాగస్వాములుగా ఉండటంతో పాటు ప్రచార కర్తలుగా ఉన్నారని చెప్పారు. అలాగే ఆ సంస్థ ప్రచార చిత్రాల్లోనూ తప్పుడు ప్రమాణాలు చేశారని వివరించారు. షరపోవా, షుమాకర్‌లు కొనుగోలుదారులతో డిన్నర్ పార్టీల్లోనూ పాల్గొన్నారని, అలాగే ఆ ప్రాజెక్ట్‌లో టెన్నిస్ అకాడమీతో పాటు క్రీడా క్లబ్ నిర్వహిస్తామనే తప్పుడు ప్రమాణాలు చేశారన్నారు. సెక్టార్-73లో షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ కోసం తమవద్ద నుంచి కంపెనీ ప్రతినిధులు 80 లక్షల రూపాయల మేర తీసుకుని ఎలాంటి ఫ్లాట్ కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తొలుత పోలీసులను ఆశ్రయిస్తే ప్రయోజనం లేకోపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో గురుగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు.