Ajinkya Rahane: రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ పై వేటు..!?
* గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతోనే జట్టులో కొనసాగుతున్న అజింక్య రహనే
Ajinkya Rahane: న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజింక్యా రహనే తన ఆట తీరుతో రెండవ టెస్ట్ మ్యాచ్ లో తుది జట్టులో స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా తన పేలవ ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న అజింక్యా రహనే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ కి దూరంగా ఉండటంతో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినా తన ఆటలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడంతో త్వరలో జరగనున్న రెండో టెస్ట్ లో వేటు తప్పదని తెలుస్తుంది.
మొదటి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగులతో క్రీడాభిమానులను మరోసారి నిరాశపరిచాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ నుండే అతడి ఫామ్ పై పలు విమర్శలు వచ్చిన విరాట్ కోహ్లి, మాజీ కోచ్ రవిశాస్త్రి సపోర్ట్ తో జట్టులో వైస్ కెప్టెన్ గా కొనసాగాడు. అయితే తాజాగా టీమిండియా నయా కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం తుది జట్టుతో పాటు ఆటగాళ్ళ ఫామ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
తుది జట్టులో ఉండి పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా ఉండే ఆటగాళ్ళపై వేటు వేయడానికి ద్రావిడ్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్ లోనే అద్భుత సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకొని మిడిల్ ఆర్డర్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఎంట్రీతో అజింక్యా రహనేపై వేటు తప్పదనే క్రీడా పండితులు జోస్యం చెబుతున్నారు.