IPL 2021: హైదరాబాద్ లక్ష్యం 188; హాఫ్ సెంచరీలతో రాణించిన కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ రానా, త్రిపాఠి
IPL 2021: నేడు జరుగుతున్న మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు జరుగుతున్న మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు భారీ లక్ష్యం ఉంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, నితిష్ రానా ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి 7 ఓవర్లకు 53 పరుగులు చేసి మంచి ఊపు మీదున్నట్లు కనిపించారు. కానీ, అదే ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన ఆఖరి బంతికి శుభ్ మన్ గిల్ 15 పరుగులు(13 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) చేసి బౌల్డ్ అయ్యాడు.
అనంతరం బ్యాటింగ్ వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి నితిష్ రానా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ ధాటిగా ఆడి తమ హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠి (53 పరుగులు, 29 బంతులు, 5 ఫోర్లు, 2 ఫోర్లు) 15.2 ఓవర్లో నటరాజన్ బౌలింగ్ లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
నాలుగో స్ఠానంలో బ్యాటింగ్ వచ్చిన ఆండ్రీ రస్సెల్ పై టీం చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. కేవలం 5 బంతులు(5 పరుగులు, 1 ఫోర్) ఆడి రషీధ్ ఖాన్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు.18 ఓవర్లో నబీ బౌలింగ్ తో కేకేఆర్ టీం ను భయపెట్టాడు. వరస బంతుల్లో సెంచరీ దిశగా సాగుతున్న నితిష్ రానా (80 పరుగులు, 56 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సులు)ను, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2 పరుగులు) ను ఔట్ చేసి దెబ్బతీశాడు.
అనంతంర బ్యాటింగ్ వచ్చిన కీపర్ దినేష్ కార్తిక్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు. దీంతో కేకేఆర్ టీం 20 ఓవర్లకు 187 పరుగులు చేసింది.
ఇక సన్ రైజర్స్ బౌలర్లలో రషీధ్ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు, నటరాజన్, భూవీ చెరో వికెట్ తీశారు.