IPL 2024: కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బర్త్ డే గిఫ్ట్ విక్టరీ అందించిన సన్ రైజర్స్

IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వీరంగం సృష్టించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్‌.. సొంత ఇలాఖాలో తమ సత్తా ఏంటో చూపెట్టింది.

Update: 2024-05-09 06:33 GMT

IPL 2024: కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బర్త్ డే గిఫ్ట్ విక్టరీ అందించిన సన్ రైజర్స్

IPL 2024: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వీరంగం సృష్టించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్‌.. సొంత ఇలాఖాలో తమ సత్తా ఏంటో చూపెట్టింది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు చుక్కలు చూపిస్తూ ప్లేఆఫ్స్‌ రేసులో మరింత ముందంజ వేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి లఖ్‌నవూను చిత్తు చేసింది. 166 పరుగుల లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ వికెట్‌ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. తమ బ్యాటింగ్‌ విధ్వంసంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు.

రాహుల్‌ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్‌పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశారు అభిషేక్‌, హెడ్‌.

కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్‌) ఊచకోతతో.. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతుల్లోనే ఛేదించిన సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింతగా మెరుగుపరచుకొంది. తొలుత లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 165/4 స్కోరు చేసింది. ఆయుష్‌ బదోని (30 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్‌), నికోలస్‌ పూరన్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్‌), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (29) రాణించారు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువనేశ్వర్‌ (4-0-12-2) రెండు వికెట్లు పడగొట్టాడు.

లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 167 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. ఐపీఎల్‌లో లఖ్‌నవూపై ఆరెంజ్‌ ఆర్మీకి ఇదే తొలి గెలుపు కావడం విశేషం. మొత్తం 14 పాయింట్లతో సన్‌రైజర్స్‌ మూడో స్థానానికి దూసుకెళ్లింది. హెడ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

Tags:    

Similar News