Sanju Samson: సంజూ శాంసన్ చరిత్ర.. ప్రపంచ క్రికెట్‌లోనే 'ఒకే ఒక్కడు'..!

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Update: 2024-11-16 04:47 GMT

Sanju Samson: సంజూ శాంసన్ చరిత్ర.. ప్రపంచ క్రికెట్‌లోనే 'ఒకే ఒక్కడు'..!

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో శతకం చేయడంతో సంజూ ఖాతాలో ఈ రేర్ రికార్డు చేరింది. ఈ ఏడాది టీ20ల్లో ఈ కేరళ ఆటగాడికి ఇది మూడో సెంచరీ. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు చేయలేదు. పించ్ హిట్టర్లు మార్టిన్ గప్తిల్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వల్ల కూడా కాలేదు.

అంతేకాదు ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా సంజూ శాంసన్ మరో రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. సంజూ కంటే ముందు ఇంగ్లండ్‌ ఆటగాడు ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో సంజూ తర్వాత తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు, నాలుగో టీ20లలో తిలక్ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు శతకాలు చేసిన భారత బ్యాటర్‌గా సంజూ ఇప్పటికే రికార్డుల్లో నిలిచిన విషయం తెలిసిందే. తిలక్‌ రెండో భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

గత బంగ్లాదేశ్‌ సిరీస్‌లోని మూడో టీ20లో సెంచరీ చేసిన సంజూ.. దక్షిణాఫ్రికా సిరీస్‌లోని తొలి టీ20లోనే శతకం బాదాడు. రెండు, మూడు టీ20ల్లో డకౌటై నిరాశపరిచిన అతడు.. చివరిదైన నాలుగో టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ.. 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 109 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇటీవలి రోజుల్లో అద్భుత సెంచరీలతో చెలరేగిన శాంసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టులో సంజూకు చోటు ఫిక్స్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న ఈ కేరళ ఆటగాడికి గత కొన్నేళ్లుగా టీమిండియాలో సరైన అవకాశాలు రాని విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ 20లకు వీడ్కోలు పలకడంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఐపీఎల్ 2024లో చెలరేగిన సంజూ శాంసన్‌కు గత జూన్ మాసంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా.. సంజూకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సెంచరీ చేసి.. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాపై రెండు శతకాలు బాది సత్తాచాటాడు.

Tags:    

Similar News