Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సారథిగా రోహిత్ శర్మ.. తేల్చిచెప్పిన జైషా
ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా ధృవీకరించారు.
BCCI Secretary Jay Shah: ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( WTC) ఫైనల్‌కు రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) సెక్రటరీ జైషా ధృవీకరించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత, WTC ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రోహిత్ శర్మ నాయకత్వంలో 2 టోర్నీల్లోనూ మేం ఛాంపియన్‌గా నిలుస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంది' అంటూ జైషా ఓ వీడియో విడుదల చేశారు.
గత వారం బార్బడోస్‌లో, రోహిత్ నాయకత్వంలో T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ తన 11 సంవత్సరాల ICC టైటిల్ కరువును ముగించిన సంగతి తెలిసిందే. అయితే, 2007లో ప్రారంభ ఎడిషన్ నుంచి జట్టును రెండవ T20 ప్రపంచ కప్ టైటిల్‌కు నడిపించిన రోహిత్, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఫైనల్ తర్వాత వెంటనే T20Iల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు రోహిత్, కోహ్లీలకు అంకితం చేశారు. ఫైనల్ చివరి ఐదు ఓవర్‌లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ చేసిన అద్భుత ప్రయత్నాలను కూడా జైషా కొనియాడారు. ఇక్కడే భారత్ బలమైన పునరాగమనం చేసింది.
“ఓ ఏడాదిలో ఇది మా మూడో ఫైనల్. గత సంవత్సరం జూన్ 11న, మేం WTC ఫైనల్‌లో ఓడిపోయాం. నవంబర్ 19న, 10 మ్యాచ్‌లు వరుసగా గెలిచిన తర్వాత.. ODI ప్రపంచకప్ ఫైనల్లో గెలవలేకపోయాం. కానీ ఈ ఏడాది మొదట్లో రాజ్‌కోట్‌లో నేను చెప్పినట్లు, రోహిత్ నాయకత్వంలో భారత్ హృదయాలతోపాటు ప్రపంచకప్‌ను గెలుచుకుంది” అంటూ షా పేర్కొన్నారు.
రోహిత్‌కి వచ్చే ఏడాది 38 ఏళ్లు నిండుతాయి. అయితే, బోర్డు మాత్రం కెప్టెన్సీలో మార్పులు కోరుకోవడంలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ ప్రస్తుతం భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈక్రమంలో ఆయననే ఈ రెండో టోర్నీల వరకు కొనసాగించాలని కోరుకుంటుంది. అయితే, హార్దిక్ పాండ్యా T20I లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నెల చివరిలో శ్రీలంక పర్యటన నుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనుంది. అయితే భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందో లేదో చూడాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అంటూ బీసీసీఐ తేల్చి చెప్పింది.
WTC విషయానికొస్తే, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే, ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. రోహిత్ జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మరో మూడు టెస్ట్ సిరీస్‌లలో పాల్గొంటుంది. టోర్నమెంట్‌లో వరుసగా మూడో ఫైనల్‌కు చేరుకోవాలని ఆశిస్తోంది.
2021లో, న్యూజిలాండ్‌తో జరిగిన WTC ఫైనల్‌లో ఓడిపోయింది. గత సంవత్సరం, జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది.