WTC Final: టీమిండియాలో అతడో డేంజర్ బ్యాట్స్‌మెన్: కివీస్ బౌలింగ్ కోచ్
WTC Final: జూన్‌లో న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
WTC Final: వచ్చే నెలలో న్యూజిలాండ్, ఇండియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆటగాళ్ల గురించి న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ షేన్ జర్గెన్‌సెన్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు.
టీం ఇండియాలో రిషభ్ పంత్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ అని అభిప్రాయపడ్డాడు. అలాగే రిషభ్ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం కివీస్ బౌలర్లకు తలనొప్పిలా మారుతుందని పేర్కొన్నాడు. ఎంతటి మ్చాచ్‌నైనా కేవలం కొన్ని క్షణాల్లో మార్చేస్తాడని ప్రశంసించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లపై రిషభ్ పంత్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూస్తే.. అతనెటువంటి వాడో ఈజీగా అర్థమవుతుందని పేర్కొన్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రిషభ్ పంత్‌పై మా బౌలర్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని వెల్లడించాడు.
రిషభ్‌పై స్పెషల్ షోకస్..
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంలపై రిషభ్ పంత్ ఎదురుదాడికి దిగిన తీరుపై తాము అధ్యయనం చేసామని, ఈ మేరకు పంత్‌పై స్పెషల్ ఫోకస్ చేశామని పేర్కొన్నాడు. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఈ మ్యాచ్ లో విజయావకాశాలను ఎట్టి పరిస్థితిలో వదులుకోవమని తేల్చి చెప్పాడు. టీమిండియా బౌలింగ్ పై ప్రశంశలు కురిపించాడు. బుమ్రా, షమీ, సిరాజ్, ఇషాంత్‌లతో టీమిండియా పేస్ దళం బలంగా తయారైందన్నాడు.
రిషభ్ పంత్ వికెట్ ను పడగొట్టేందుకు ఎలాంటి అవకాశాలొచ్చినా వదులుకోకూడదు. ఎందుకంటే టీమిండియాలో అతనో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్. ఏస్థితిలోనైనా మ్యాచ్‌ను మలుపుతిప్పగల వాడు. పంత్ ను పరుగులు చేయకుండా ఇబ్బంది పెట్టడంలో బౌలర్లు శ్రమించాలి. ఇలా అయితేనే అతను త్వరగా వికెట్ సమర్పించుకునే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. రిషభ్ స్వేచ్ఛగా ఆడే బ్యాట్ ఝులిపించే బ్యాట్స్‌మన్. కుదురుకున్నాక పంత్‌ను ఆపడం చాలా కష్టం. మా బౌలర్లు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. అయితే భారత్ కు కూడా గెలిచేందుకు చాలానే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు టీమిండియా సొంతం. రవీంద్ర జడేజా, అశ్విన్ వైవిధ్యంగా బౌలింగ్ చేయలగలరు. వీరికి అక్షర్ పటేల్ అదనపు బలంగా ఉంటాడని జర్గెన్‌సెన్ తెలిపాడు.
కివీస్ ప్రాక్టీస్ షురూ..
డబ్యూటీసీ ఫైనల్‌లో ఆడేందుకు న్యూజిలాండ్ టీం ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది. అయితే, ఫైనల్ మ్యాచ్‌కు ముందు కివీస్ టీం ఇంగ్లాండ్‌తో 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో కివీస్ టీంకు బాగా ప్రాక్టీస్ దొరకనుంది. ఇక టీం ఇండియా జూన్ 2న లండన్ కు బయల్దేరనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది.