South Africa: సౌతాఫ్రికా క్రికెట్‌లో దుమారం.. సందిగ్ధంలో డికాక్‌ భవితవ్యం..

South Africa: *బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ ఉద్యమానికి ఆటగాళ్ల మద్దతు *మోకాళ్లపై కూర్చొని సంఘీభావం తెలిపిన ప్లేయర్లు

Update: 2021-10-28 06:00 GMT

South Africa: సౌతాఫ్రికా క్రికెట్‌లో దుమారం.. సందిగ్ధంలో డికాక్‌ భవితవ్యం..

South Africa: వెస్టిండీస్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ మొదలు కాబోతుండగా.. సౌతాఫ్రికా టీమ్‌లోని కీలక ఆటగాడైన క్వింటన్‌ డికాక్‌ వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకోవడం ఆ దేశ క్రికెట్లో దుమారం రేపింది. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్ ఉద్యమానికి మద్దతుగా ఆటగాళ్లందరూ మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలపాలని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు హుకుం జారీ చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

గత ఏడాది అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ - శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి కర్కశత్వానికి బలైన వీడియో అందరినీ కదిలించింది. దాన్నుంచి ఉవ్వెత్తున ఎగసిన 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. క్రికెట్లోనూ అది కొనసాగుతోంది.

వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లంతా మోకాళ్లపై కూర్చుని ఆ ఉద్యమానికి మద్దతిచ్చారు. అయితే.. దక్షిణాఫ్రికా జట్టు దగ్గరికొచ్చేసరికి ఈ సంఘీభావ ప్రకటన వివాదాస్పదమైంది.

సౌతాఫ్రికా ఆడిన గత మ్యాచ్‌లో బవుమా సహా కొందరు ఆటగాళ్లు 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమానికి సంఘీభావంగా మైదానంలో మోకాళ్లపై కూర్చుంటే.. డికాక్‌ మాత్రం చూస్తూ నిలబడ్డాడు. ఇక.. ఆటగాళ్లు ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తే చెడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో విండీస్‌తో మ్యాచ్‌కు ముందు అందరూ ఒకే తరహాలో సంఘీభావం తెలపాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది.

అయితే దీని పట్ల అసంతృప్తితో ఉన్న డికాక్‌.. బోర్డు ఆదేశాలను నిరాకరించారు. ఫలితంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. సంఘీభావ ప్రకటన తరవాతి మ్యాచ్‌ల్లోనూ కొనసాగుతుందని దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించడంతో డికాక్‌ భవితవ్యం సందిగ్ధంలో పడింది.

Tags:    

Similar News