Prithvi Shaw: బరువే 'పృథ్వీ షా'కు శాపమైందా?
Prithvi Shaw: న్యూజిలాండ్‌తో WTC ఫైనల్ తో పాటు ఇంగ్లండ్‌తో 5 సిరీస్‌కు టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Prithvi Shaw: జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ 20 మంది ప్రాబబుల్స్‌లో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, కుల్దీప్, భువనేశ్వర్ లు ఎంపిక కాలేదు. పృథ్వీ షా ఎంపిక కావపోవడం క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు మాజీలకు కూడా కాస్త ఆశ్చర్యం కలిగించింది.
వాస్తవానికి ఆసీస్ పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు పృథ్వీ షా. దాంతో ఉద్వాసనకు గురయ్యాడు. ఆ తర్వాత దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోపీలో అద్భుత ఫాంతో రెచ్చిపోయాడు. 4 శతకాలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లోనూ దుమ్మురేపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు.
అయితే పృథ్వీ షాను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి కారణం అతను ఎక్కువ వెయిట్ ఉండడమేనని తెలుస్తోంది. ఈ కారణంతోనే బీసీసీఐ పృథ్వీ షాను పరిగణలోకి తీసుకోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం పృథ్వీ షా కాస్త వెయిట్ తగ్గాల్సి ఉందని.. అందుకు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఉదాహరణగా తీసుకోవాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. పంత్ కూడా వెయిట్ లాస్ అయ్యాకే తిరిగి జట్టులోకి వచ్చి దుమ్మురేపుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం.